Karnataka News: ఇటీవలే విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయగా.. తాజాగా బస్సులో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బస్సులో వెళ్తూ గాఢ నిద్రలో ఉన్న ఓ మహిళపై ఓ యువకుడు మూత్ర విసర్జన చేశాడు. తడిగా అనిపించడంతో కేకలు పెడుతూ నిద్రలోంచి బయటకు వచ్చిన ఆమె విషయాన్ని అందరికీ వివరించింది. వెంటనే బస్సు డ్రైవర్, కండక్టర్, మిగతా ప్రయాణికులు అతడిని తిట్టి కిందకు దింపేశారు. అయితే నిందితుడు ఇంజినీరింగ్ స్టూడెంట్ అని తెలుస్తోంది.

  


అసలేం జరిగిందంటే..?


కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర నుంచి మంగళూరుకు వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరులో ఓ దాబా వద్ద మంగళవారం రోజు అర్ధరాత్రి ఆగింది. ఎక్కువ మంది ప్రయాణికులు బస్సు దిగి టీ తాగేందుకు వెళ్లారు. బస్సు ముందు వరుసలో ఓ మహిళ కూర్చొని ఉంది. వెనుక 28వ నంబరు సీటు నుంచి వచ్చిన 28 ఏళ్ల రామప్ప ఆమె సమీపంలోకి వెళ్లి ఆమెపై మూత్ర విసర్జన చేశాడు. అయితే అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ఆమె తుళ్లిపడి లేచింది. ఏమైందో తెలియక భయపడి తీవ్రంగా కేకలు వేసింది. దీంతో బయట టీ తాగుతున్న ప్రయాణికులతోపాటు బస్సు డ్రైవర్, కండక్టర్ బస్సులోకి వచ్చారు. ఏం జరిగిందని మహిళను అడగ్గా.. ఆమె జరిగింది చెప్పింది. దీంతో తీవ్ర కోపోద్రేకానికి గురైన ప్రయాణికులు.. రామప్పను తీవ్రంగా దూషించారు. ఒకరిద్దరు అయితే అతడిపై చేయి కూడా చేసుకున్నారు. 


అనంతరం అతడిని బస్సు నుంచి కిందకు దింపేశారు. అతని సామగ్రిని బయట పడేశారు. ఒకరిద్దరు ప్రయాణికులు రామప్పపై చేయి చేసుకున్నారు. మహిళను ఓదార్చారు. ఆమె దాబాలోని స్నానాల గదిలో స్నానం చేసి, దుస్తులు మార్చుకునే వరకు బస్సును అక్కడే నిలిపి ఉంచారు. నిందితుడు మద్యం మత్తులో ఉండి ఇలా చేశాడని భావించారు. మహిళ విన్నపం మేరకు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కండక్టర్ తెలిపారు.  


ఇటీవలే విమానంలో ఇలాంటి ఘటనే.. 


అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చే Air India ఫ్లైట్‌లో ఓ ప్రయాణికుడు మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటన సంచలనమైంది. నిందితుడిపై కేసు నమోదు చేశారు. గతేడాది నవంబర్ 26 న ఈ ఘటన జరగ్గా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌ ఇండియా అధికారులు చెప్పిన వివరాల ప్రకారం..ఈ కేసు విచారణకు అంతర్గత కమిటీని ప్రత్యేకంగా నియమించారు. "ఈ ఘటనపై విచారణకు  ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశాం. అంతే కాదు. ఆ నిందితుడిని "No Fly" జాబితాలో చేర్చాలని ప్రతిపాదించాం. దీనిపై నిర్ణయం ప్రభుత్వానిదే. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఎదురు చూస్తున్నాం" అని వెల్లడించారు. బిజినెస్‌ క్లాస్‌లో ఈ ఘటన జరిగినట్టు వివరించారు. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఇలా అసభ్యంగా ప్రవర్తించినట్టు చెప్పారు. ప్రస్తుతానికి కేసు విచారణలో ఉంది. ఈ మధ్య కాలంలో విమానాల్లో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రయాణికులు గొడవపడటం,  సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించడం లాంటివి తరచూ వెలుగులోకి వస్తున్నాయి.