Karnataka High Court: ర్యాపిడో బైక్ టాక్సీలు సహా బైక్ టాక్సీ అగ్రిగేటర్లకు కర్ణాటక హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆరు వారాల్లో కార్యకలాపాలను పూర్తిగా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధారం కీలక వ్యాఖ్యలు చేసింది. రాపిడో మాతృ సంస్థ, రోపీన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే ఉబర్, ఓలా (ANI టెక్నాలజీస్) వంటి ఇతర టాక్సీ అగ్రిగేటర్లు దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరిస్తూ జస్టిస్ బి శ్యామ్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇలా టాక్సీలుగా తీరుగుతున్న తమ వాహనాలకు చట్టబద్ధత ఇవ్వాలని, రవాణా వాహనాలుగా గుర్తించాలని పిటిషనర్లు కోర్టుకు అభ్యర్థించారు. ఈమేరకు వివిధ సంస్థలు పిటిషన్లు దాఖలు చేశారు. బైక్ టాక్సీల కోసం చట్టపరమైన చర్యలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లలో కోరారు. బైక్ టాక్సీ సేవలను అందిస్తున్న రాపిడో...తమ వ్యాపారంలో జోక్యం చేసుకోకుండా  అధికారులు నిరోధించడానికి ఆదేశాలను కోరింది.

ఏప్రిల్ 2022లో ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ జ్యోతి మిలిమణితో కూడిన ధర్మాసనం పిటిషనర్లకు రిలీఫ్ ఇచ్చింది. అధికారులు ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు నేటి వరకు కొనసాగుతున్నాయి. రాపిడో టాక్సీలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి వీలు కల్పించింది. 

దీనిైప జస్టిస్ ప్రసాద్ 2023లో మొదట విచారించారు. ఈ రోజు పిటిషనర్లు కోరిన విధంగా రూల్స్‌ ఫ్రేమ్‌ చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించలేమని తేల్చి చెప్పారు. రవాణాయేతర వాహనాలను రవాణా వాహనాలుగా నమోదు చేయమని చెప్పలేమని తీర్పు చెప్పిన తర్వాత ఆయన పిటిషన్లను కొట్టివేశారు. తీర్పులో భాగంగా బైక్ టాక్సీ అగ్రిగేటర్లు ఆరు వారాల్లోపు అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని కోర్టు స్పష్టం చేసింది.