Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన డీకే శివకుమార్ ప్రభుత్వంలో అప్పుడే అసమ్మతి సెగ మొదలయ్యాయి. అమాత్యుల మధ్య శాఖల పంపిణీ జరిగిన 24 గంటల్లోనే ఆగ్రహజ్వాలలు రేగుతున్నాయి. సీనియర్ నాయకులు , ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేశారు. తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Continues below advertisement

ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తన మంత్రివర్గంలోని 13 మంది సభ్యులకు గురువారం శాఖలు కేటాయించారు. ఇందుల భాగంగా బీటీఎం లేఅవుట్ నియోజకవర్గానికి చెందిన రామలింగారెడ్డికి నీటిపారుదల శాఖ కేటాయించారు. అయితే తనకు ఈ శాఖ వద్దని, బెంగళూరు నగర అభివృద్ధి శాఖ కావాలని పట్టుబట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ కీలకమైన బెంగళూరు అభివృద్ధి శాఖను కృష్ణ బైరేగౌడకు కేటాయించడమే రామలింగారెడ్డి ఆగ్రహానికి ప్రధాన కారణం. 

రామలింగారెడ్డి మాత్రం తను ఎలాంటి శాఖ అడగలేదని అంటున్నారు. ఈ ఉదయం ప్రెస్‌ మీట్ పెట్టి అందరి ముందే రాజీనామాపై సంతకం చేసి సీఎంకు పంపించారు. తాను ఎలాంటి పదవులు కోరుకోలేదని చెప్పారు. బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తానంటూ తనకు డీకే శివకుమార్ మాట ఇచ్చారని చెప్పారు రామలింగారెడ్డి. ఇచ్చిన మాట తప్పినందుకే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు వివరించారు. 

72 ఏళ్ల రామలింగారెడ్డి కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్. గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వంలో రవాణా, హిందూ ధార్మిక సంస్థల శాఖ మంత్రిగా, 2017-18 మధ్య కాలంలో హోంమంత్రిగా పని చేశారు. ఇంతటి సీనియారిటీ ఉన్న తనకు, బెంగళూరు నగర రాజకీయాలపై పట్టున్న తనకు, బెంగంళూరరు అర్బన్ డెవలప్‌మెంట్ కాకుండా నీటిపారుదల శాఖ ఇవ్వడం అవమానించడమేనని ఆయన భావిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు ఆ శాఖ తప్ప వేరే ఏ శాఖ ఇచ్చినా తక్కువ చేసినట్టేనని చెబుతున్నారు. 

మంత్రివర్గ విస్తరణ తర్వాత డీకే శివకుమార్ ప్రభుత్వం సుస్థిరంగా సాగుతుందని భావించిన తరుణంలో ఈ పరిణామం కాంగ్రెస్‌ను అలర్ట్ చేసింది. దిద్దుబాటు చర్యలకు అటు శివకుమార్, ఇటు ఢిల్లీ పెద్దలు సిద్ధపడ్డారు. రామలింగారెడ్డి 2023లో బీజేపీ అభ్యర్థి కేఆర్ శ్రీధరపై సుమారు 50 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

ఈ నెలాఖరున కర్ణాటకలో రెండో విడత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఐదుగురు ముస్లిం నాయకులకు కేబినెట్ పదవులు ఇవ్వాలని డిమాండ్ కూడా పార్టీ ముందు ఉంది. ఈలోపే రామలింగారెడ్డి వంటి బలమైన నేతను బుజ్జగించకపోతే, డీకే శివకుమార్ నాయకత్వంలోని ప్రభుత్వ మొదటి గండంలో పడ్డట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.