Karnataka Women Leaves | పని చేసే మహిళల కోసం కర్ణాటక ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా, రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సంవత్సరానికి 12 వేతనంతో కూడిన పీరియడ్ సెలవులను (Menstrual Leave) మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రుతుస్రావ సెలవులను మహిళా కార్మికోద్యోగుల హక్కుగా గుర్తించడంలో కర్ణాటక రాష్ట్రం దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

Continues below advertisement


కర్ణాటక రాష్ట్రం ప్రకటించిన రుతుస్రావ (పీరియడ్) సెలవుల పథకం వివరాలు


రాష్ట్రంలో 18 నుండి 52 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు (శాశ్వత, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో) ఈ పథకం వర్తిస్తుంది. ఫ్యాక్టరీల చట్టం, 1948 అనుసరించి, దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం, 1961, ప్లాంటేషన్ వర్కర్స్ చట్టం, 1951, బీడీ, సిగార్ కార్మికుల చట్టం, 1966, మరియు మోటార్ కార్మికుల చట్టం పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలలో పనిచేసే మహిళలకు ఈ సెలవులు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సెలవులను ప్రతీ నెల వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ సెలవులను మున్ముందు వాడుకోవడానికి (Carry Forward) వీలు లేదు. మహిళా ఉద్యోగులు సెలవు తీసుకోవడానికి వైద్య ధృవీకరణ పత్రం అవసరం లేదు. దీని వల్ల మహిళలు సులభంగా రుతుస్రావ సెలవులు తీసుకునే అవకాశం కలుగుతుందన్నది ప్రభుత్వ భావన. ఇలా సంవత్సరానికి 12 రోజులు వేతనంతో కూడిన రుతుస్రావ సెలవులు పనిచేసే మహిళలు తీసుకోవచ్చు.


ప్రపంచంలో చాలా దేశాల్లో అమలు


ప్రపంచ వ్యాప్తంగా ఈ సెలవుల కోసం ఆయా దేశాల్లో పెద్ద ఎత్తున మహిళా ఉద్యమాలు సాగాయి. స్పెయిన్, జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా వంటి దేశాల్లో రుతుస్రావ సెలవు సౌకర్యం ఇప్పటికే అమల్లో ఉంది.ఇక మన దేశంలో కొన్ని పరిమితులతో ఈ సౌకర్యాన్ని ఆయా రాష్ట్రాలు కల్పిస్తున్నాయి: బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే మహిళలకు నెలలో రెండు రోజులు సెలవు ఇస్తున్నారు. కేరళలో విశ్వవిద్యాలయాలు, ఐఐటీలలో పనిచేసే మహిళా సిబ్బందికి నెలకు రెండు రోజుల సెలవు అమల్లో ఉంది. అయితే, కర్ణాటకలో మాత్రమే ఫ్యాక్టరీలు, వాణిజ్య దుకాణాలు, ప్లాంటేషన్లు, మోటార్ వాహన రంగాలకు ఈ సెలవులను విస్తరించింది. తెలంగాణలో కూడా ఇలాంటి చట్టం చేయాలని మహిళా కార్మికోద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.