Jet Airways: మనీల్యాండరింగ్ ఆరోపణల కేసులో ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు (Jet Airways) చెందిన రూ.538 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం, 2002 నిబంధనల కింద ఈ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జెట్ ఎయిర్‌వేస్ సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఆయన భార్య, కుమారుడికి చెందిన లండన్, దుబాయ్ సహా భారత్‌లో వివిధ ప్రదేశాల్లో ఉన్న 17 కమర్షియల్ ఫ్లాట్‌లు, ఇతర ఆస్తులను ఈడీ ఈ మేరకు సీజ్ చేసింది.
కెనరా బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఆ నిధులను దారిమళ్లించారనే ఆరోపణలపై నరేశ్ గోయల్ సహా ఐదుగురిపై ఈడీ కేసు నమోదు చేసింది. సెప్టెంబర్ 1న నరేష్ గోయల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో అక్టోబరు 31న ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్ ప్రకారం జెట్ ఎయిర్‌లైన్‌కు కెనరా బ్యాంకు రూ. 848 కోట్ల వరకు క్రెడిట్ పరిమితులు, రుణాలను మంజూరు చేసిందని ఆరోపించింది. వీటిలో రూ. 538 కోట్లు బకాయి ఉన్నాయి.
ఈ కేసులో ఈడీ పలు ఆరోపణలు చేసింది. విదేశాల్లో ట్రస్ట్‌లను సృష్టించి.. వాటి ద్వారా డబ్బును దారి మళ్లించినట్లు తెలిపింది. ఆ ట్రస్టుల ద్వారా స్థిరాస్తుల కొనుగోలుకు గోయల్ ఉపయోగించారని ఆరోపించింది. ఆడిట్ నివేదికను ఉటంకిస్తూ.. జెట్ ఎయిర్‌వేస్ తీసుకున్న రుణాలను ఆస్తులు కాకుండా ఫర్నిచర్, దుస్తులు, ఆభరణాల కొనుగోలుకు ఉపయోగించినట్లు పేర్కొంది. అది మోసపూరితంగా వచ్చిన ఆదాయం తప్ప మరొకటి కాదని ఈడీ తెలిపింది.
సెప్టెంబరు 12న కోర్టు విచారణ సందర్భంగా ఏవియేషన్ రంగం బ్యాంకు రుణాలపై నడుస్తుందని, అన్ని నిధులను మనీలాండరింగ్ అని పేర్కొనలేమని నరేశ్ గోయల్ అన్నారు. గోయల్ లేదా ఆయన కుటుంబం పేరు మీద ఎలాంటి రుణం తీసుకోలేదని, గ్యారెంటర్‌గా ఉండలేదని ఆయన తరఫు న్యాయవాదులు అబ్బద్ పాండా, అమిత్ దేశాయ్, అమిత్ నాయక్ కోర్టుకు తెలిపారు. 2011కి ముందు జెట్ ఎయిర్‌వేస్ తీసుకున్న బ్యాంకు రుణాలలో గణనీయమైన మొత్తంలో సహారా ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఉపయోగించారని న్యాయవాదులు తెలిపారు.
వ్యాపార రంగంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని, కేవలం జెట్ ఎయిర్‌వేస్ మాత్రమే కాదు, ఇతర విమానయాన సంస్థలు కూడా సంక్షోభంలో ఉన్నాయని, విమానయాన రంగం బ్యాంకుల నిధుల ఆధారంగా నడుస్తుందని, వీటన్నింటిని లాండరింగ్‌గా పేర్కొనలేమని గోయల్ తరపు న్యాయవాది చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం ఉందని, అందుకే కొంత తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యారని లాయర్ వాదించారు. దీనిపై కోర్టు కలగజేసుకుని స్పందిస్తూ.. గోయల్ తన అన్ని బ్యాంకు ఖాతాలతో పాటు భారత్, విదేశాలలో ఉన్న స్థిర చరాస్తులు వివరాలను ఇవ్వకుండా తప్పించుకున్నారని వ్యాఖ్యానించింది.
కమర్షియల్ క్యారియర్ జెట్ ఎయిర్‌వేస్ దశాబ్ధాల తరబడి సేవలందించిన అనంతరం నగదు నిల్వల కొరత, ఇతర ఆర్ధిక ఇబ్బందులతో 2019 ఏప్రిల్‌లో మూతపడింది. అదే ఏడాది జూన్‌లో నరేష్ గోయల్ కంపెనీ బాధ్యతల నుంచి వైదొలగిన అనంతరం జెట్ ఎయిర్‌వేస్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) వద్ద దివాళా పిటిషన్ దాఖలు చేసింది.