ISRO Shared Maha Kumbhmela 2025 Images: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా 2025 (Maha kumbhmela 2025) వైభవంగా సాగుతోంది. జనవరి 13న మొదలైన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకూ సాగనుంది. ఇప్పటికే 9 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అంతేకాకుండా నాగ సాధువులు, బాబాలు ఎంతో మంది ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కుంభమేళాలో 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ కుంభమేళాకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) తాజాగా స్పేస్ వ్యూ చిత్రాలను విడుదల చేసింది. స్పేస్ సెంటర్ నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మహా కుంభమేళాకు ఏర్పాట్లు చేయకముందు, చేసిన తర్వాత తీసిన ఫోటోలను పంచుకుంది.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
2024 ఏప్రిల్ 6వ తేదీన ఫోటోలో ఆ ప్రాంతమంతా ఖాళీగా కనిపించగా.. 2024 డిసెంబర్ 22, 2025, జనవరి 10న చిత్రాల్లో వివిధ మౌలిక సదుపాయాలతో పాటు అక్కడి శివాలయ పార్క్ కూడా దర్శనమిచ్చింది. ఈ కార్యక్రమానికి యూపీ సర్కారు భారీగా ఏర్పాట్లు చేసింది. దాదాపు లక్షా 60 వేల టెంట్లు ఏర్పాటు చేయగా.. లక్షా 50 వేల టాయిలెట్లు నిర్మించారు. దాదాపు 15 వేల మంది శానిటేషన్ వర్కర్లు పని చేయనున్నారు. 1,250 కి.మీ దూరం పైప్ లైన్స్ వేశారు. 67 వేల ఎల్ఈడీ లైట్లు, 2 వేల సోలార్ లైట్లు, వంద బెడ్లతో సెంట్రల్ ఆస్పత్రి, రెండు 20 పడకల సబ్ సెంటర్ ఆస్పత్రులు, 25 ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక కుంభమేళాలో ఎల్లప్పుడూ 125 అంబులెన్సులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.
కాగా, 45 రోజుల పాటు సాగే ఈ మేళా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే, 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి కూడా లభిస్తుందని తెలిపాయి. 10 వేల ఎకరాల్లో మహా కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని.. ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి కోటి వరకూ పుణ్యస్నానాలు ఆచరించేలా సౌకర్యాలు కల్పించామని ప్రభుత్వం, అధికారులు వెల్లడించారు.
కుంభమేళాలో యూపీ సీఎం స్నానాలు
మహా కుంభమేళాలో యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్ సహా కేబినెట్ మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు.