ISIS Target BJP Offices: ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) బీజేపీ (BJP) నేతల హత్యలకు భారీ ప్లాన్ చేసింది. ఆ పార్టీ కార్యాలయాలపై దాడుల చేసి నేతలను హతమార్చేందుకు వ్యూహ రచన చేసింది. మహారాష్ట్రలోని సంభాజీ నగర్, ఇతర జిల్లాల్లోని బీజేపీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో పాటు పలువురు హిందూ రాజకీయ నేతలను హతమార్చేందుకు పథకం రచించింది. ఉగ్రవాద పేలుళ్లు, హత్యలు చేసేందుకు తుపాకులు, మందుగుండు సామగ్రి, సిమ్ కార్డ్‌లను ఐసిస్ ఇండియాలోని తన స్లీపర్ సెల్‌కు అందించింది.
రెండు టెలిగ్రామ్ ఛానెళ్లు
ఇటీవల ఎన్‌ఐఏ (NIA) అరెస్ట్ చేసిన ఉగ్రవాద నిందితుడు మహ్మద్ జోహెబ్ ఖాన్ (Mohammad Zoheb Khan) ఈ విషయాలను వెల్లడించాడు. బీజేపీ కార్యాలయాలు, నేతల హత్య కోసం ఐసిస్‌కు చెందిన అబూ అహ్మద్ ( Abu Ahmed) తనతో ‘అనస్-అల్-హిందీ’(Anas-Al-Hindi), ‘అనన్-అల్-హిందీ’ (Anan-Al-Hindi) పేరుతో టెలిగ్రామ్ లింక్‌లను షేర్ చేశారని మహ్మద్ జోహెబ్ ఖాన్ తెలిపారు. ఐసిస్ స్లీపర్ సెల్‌ను సంప్రదించడానికి, తుపాకులు, మందుగుండు, సిమ్ కార్డుల కోసం ఉపయోగించే వారని జోహెబ్ వెల్లడించాడు. ఇందుకోసం ‘సమన్ చాహియే’ అనే కోడ్ వాడేవారని తెలిపాడు.
‘సమన్ చాహియే’
జోహెబ్ వారి సూచనల మేరకు రెండు టెలిగ్రామ్ ఐడీలను సంప్రదించి ‘సమన్ చాహియే’ (Saman Chahiye) అని మెస్సేజ్ చేశాడు. వెంటనే.. సరకు త్వరలో డెలివరీ చేయబడుతుందని సమాధానం వచ్చింది. జోహెబ్ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు టెలిగ్రామ్ ఐడీలతో మొదటి, చివరి మెస్సేజ్ అదే. ఆ తరువాత అతను వారికి ఎటువంటి మెస్సేజ్‌లు చేయలేదు.
బీజేపీ నేతలపై నిఘా పెట్టాలని ఆదేశాలు
ఐసిస్ హ్యాండ్లర్ సూచనల మేరకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కోసం టెలిగ్రామ్ టెలిగ్రామ్ లింకులను సంప్రదించానని జోహెబ్ ఖాన్ వెల్లడించాడు. వారిని వ్యక్తిగతంగా కలవలేదని, కేవలం బీజేపీ కార్యాలయాలు, నాయకుల కదలికలను పరిశీలించే పని అప్పగించారని చెప్పాడు. దీంతో ఎన్‌ఐఏ గత ఏడాది కాలంలో శంభాజీ నగర్ వెలుపల జోహెబ్ కదలికలను గుర్తించే డేటా విశ్లేషణలో నిమగ్నమై ఉంది.
విశ్వసనీయ సమాచారం మేరకు.. జోహెబ్ ఒక టెర్రర్ ఆపరేషన్‌లో కీలకంగా ఉన్నాడని, ఉగ్రదాడులు జరగకుండా ఉండేందుకు ఏజెన్సీ అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. అలాగే ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చే అల్ హిందీ మాడ్యూల్ స్లీపర్ సెల్ సభ్యులను గుర్తించే పనిలో ఉంది.
ఐసిస్‌కు విధేయతా ప్రమాణం
జోహెబ్ ఖాన్‌కు 2021 నుంచి ఐసిస్ హ్యాండ్లర్ అబూ అహ్మద్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. జోహెబ్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి వీడియో కాల్ ద్వారా ఐసిస్ ఖలీఫా అబూ-హఫ్స్‌కు బయాహ్ (విధేయత ప్రమాణం) చేశాడు. అబూ హాఫ్స్ 3 ఆగస్టు 2023న ఐసిస్ నాయకత్వాన్ని స్వీకరించాడు. బయాత్ తర్వాత భార్య, పిల్లలతో సిరియాకు వలస వెళ్లాలని అనుకున్నానని, అయితే తన భార్య అందుకు నిరాకరించిందని జోహెబ్ వెల్లడించాడు.
సోషల్ మీడియా అకౌంట్లతో ఎర
ఐసిస్ హ్యాండ్లర్ అబూ అహ్మద్ సూచనల మేరకు జోహెబ్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించాడు. ఐసిస్ కోసం వ్యక్తులను నియమించడం, నిఘా కార్యకలాపాల కోసం ఫుట్ సైనికులను ఏర్పాటు చేయడం, నిధుల సేకరణ, పేలుళ్లు, హత్యల ప్రణాళికలను చేసే పనిని అప్పగించాడని జోహెబ్ విచారణలో వెల్లడించాడు. ఇందుకోసం ప్రత్యేకంగా సోషల్ మీడియాలో అనేక ప్రొఫైల్‌లను సృష్టించి యువతను ఐసిస్‌లో చేరడానికి ప్రేరేపించాడు.
ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య
జోహెబ్ చేస్తున్న పనికి సహకరించడానికి అతని భార్య నిరాకరించింది. పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో జోహెబ్ సిరియా వెళ్లడానికి నిధుల సేకరణ చేయడం ప్రారంభించాడు. ఇందుకోసం అతను భారత్ నుంచి అఫ్ఘనిస్తాన్‌కు వెళ్లాలని ప్లాన్ చేశాడు. సిరియా వెళ్లే ముందు ఆఫ్ఘనిస్తాన్‌లోని తన హ్యాండ్లర్‌ను కలవాలని అనుకున్నాడు.