LPG Shortage: ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో జరిగినా, దాని ప్రభావం ఇప్పుడు నేరుగా భారతీయుల వంటగదులపై కనిపించడం ప్రారంభమైంది. దేశంలో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న ఫుడ్ వ్యాపారాలు వంటకు పూర్తిగా ఆధారపడే  కమర్షియల్ LPG సిలిండర్ల సరఫరా తగ్గడం వల్ల ఆందోళనలు పెరుగుతున్నాయి. కొన్ని నగరాల్లో ఇప్పటికే సరఫరా అంతరాయం ఏర్పడగా, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని వ్యాపారాలు మూతపడే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.  

Continues below advertisement

దేశంలో గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం రావడంతో ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. చమురు సంస్థలపై  Essential Services Maintenance Act ను ప్రయోగించింది. గృహవినియోగానికే LPG ని ముందుగా కేటాయించాలని సూచించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ వ్యవధిని కూడా 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారు.  

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తున్న LPG రవాణాపై ప్రభావం పడింది. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన మార్గమైన హోర్ముజ్ జలసంధి ద్వారా వచ్చే సరుకు రవాణా అంతరాయం ఎదుర్కొంటోంది. భారత్ వినియోగించే LPGలో పెద్ద భాగం ఈ మార్గం గుండా వస్తుండటంతో  సప్లై చెయిన్ దెబ్బతింది. 

Continues below advertisement

భారత్‌లో LPG వినియోగం భారీగా ఉంది. ప్రతి సంవత్సరం దేశం సుమారు 31.3 మిలియన్ టన్నుల LPG  వినియోగిస్తుంది. అయితే ఇందులో కేవలం 12.8 మిలియన్ టన్నుల మాత్రమే దేశంలో ఉత్పత్తి అవుతుంది. . మిగిలింది మొత్తం దిగుమతి చేసుకోవలసిందే. అంటే దేశ అవసరాల్లో 60 శాతం కంటే ఎక్కువ LPG విదేశాలపైనే ఆధారపడి ఉంది. ఈ దిగుమతుల్లో పెద్ద భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. ముఖ్యంగా యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా వంటి దేశాలు భారత LPG సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక్కడి నుంచే దాదాపు 80శాతం మనకు వస్తుంది. ఈ దేశాల నుంచి ఇంధనం వచ్చే ప్రధాన మార్గం హార్ముజ్‌ జలసంధి మూసేయడంతో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. క్రూడ్ ఆయిల్‌ అన్నా ఇతర మార్గాల ద్వారా మనకు వస్తుంది కానీ.. గ్యాస్ మాత్రం ఈ రూట్‌ నుంచే అధికంగా అందుతోంది.  

మూసివేత దిశగా రెస్టారెంట్లు

యుద్ధ ప్రభావం ఇప్పటికే కొన్ని నగరాల్లో కనిపిస్తోంది.  ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే వంటి నగరాల్లో రెస్టారెంట్లు కమర్షియల్ LPG సిలిండర్లు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొంతమంది హోటల్ యజమానులు సరఫరా లేకపోతే తమ వ్యాపారాలను తాత్కాలికంగా మూసివేయాల్సి వస్తుందని చెబుతున్నారు.  ముంబైలో ఇప్పటికే కొంతమంది హోటళ్లు కార్యకలాపాలు నిలిపివేయగా, సరఫరా ఆలస్యం కొనసాగితే మరిన్ని వ్యాపారాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని హోటల్ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇంకా మూసివేత వరకూ పరిస్థితులు వెళ్లకపోయినా హోటల్ అసోసియేషన్ సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 

ఇదే సమయంలో LPG ధరలు కూడా పెరిగాయి. మార్చి 7న దేశవ్యాప్తంగా  గృహ వినియోగ LPG సిలిండర్ ధరను ₹60 పెంచారు. 

ఉత్పత్తి పెంచాలని రిఫైనరీలకు ఆదేశాలు సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీ దేశంలో LPG నిల్వలు, సరఫరా పరిస్థితిని కేంద్రమంత్రులు జైశంకర్, హర్దీప్ సింగ్‌లతో సమీక్షించారు.  ఆ తర్వాత రిఫైనరీలకు LPG ఉత్పత్తి పెంచాలని కేంద్రం ఆదేశించింది. అదేవిధంగా గృహ వినియోగదారులకు సరఫరా లోటు రాకుండా సిలిండర్ బుకింగ్ మధ్య గడువును కూడా పెంచారు. 

అయితే ఇప్పటివరకు ప్రభుత్వం గృహ వినియోగ LPG సరఫరా సురక్షితంగా ఉందని చెబుతోంది. కానీ యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై దాని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు సరఫరా, ధరలు రెండూ పెద్ద సవాలుగా మారే అవకాశముంది.

 ఇరాన్ యుద్ధం కేవలం జియో పాలిటిక్స్‌ను మాత్రమే కాదు.. అది ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను కుదిపేస్తూ, చివరకు భారత్‌లోని సాధారణ కుటుంబాల వంటగదుల వరకు ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది.