First Bullet Train In India: ముంబయి - అహ్మదాబాద్‌ బుల్లెట్ ట్రైన్‌ (Mumbai Ahmedabad Bullet Train) పై కేంద్రం కీలక అప్ డేట్ ఇచ్చింది. 2026 ఆగస్టు నాటికి అహ్మదాబాద్‌ - ముంబయి మార్గంలో కొంతభాగం అందుబాటులోకి వస్తుందని రైల్వేమంత్రి (Railway Minister) అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) వెల్లడించారు. గుజరాత్‌లోని సూరత్‌ నుంచి బిలిమోరా (Surat To Bilimora) వరకు 50 కి.మీ. దూరం వరకు వ్యవస్థ సిద్ధం అవుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో రైళ్ల సంఖ్యను గణనీయంగా పెంచినట్లు మంత్రి చెప్పారు. కరోనా సమయం కంటే ముందుతో పోలిస్తే కొత్త రైళ్ల సంఖ్యను పెంచామని అన్నారు. 


దేశంలో మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల సంఖ్యను 1,768 నుంచి 2,124కు, సబర్బన్‌ సర్వీసులను 5,626 నుంచి 5,774 వరకు పెంచామన్నారు. అలాగే ప్యాసింజర్‌ రైళ్ల సంఖ్య 2,792 ఉండగా ప్రస్తుతం 2,856కు పెరిగిందన్నారు. రైల్వే ట్రాక్‌లపై ప్రమాదాలను నిరోధించేందుకు కవచ్‌ వ్యవస్థ, ఏనుగుల వధ నిరోధానికి  గజ్‌రాజ్‌ వ్యవస్థను పటిష్టంగా రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అదనపు ట్రాక్‌ల అవసరం ఉందని, వాటి ఏర్పాటుపై ఉన్నతాధికారులతో జరిపిన సమావేశంలో చర్చించినట్లు చెప్పారు.


2021లో పనులు ప్రారంభం
అహ్మదాబాద్‌-ముంబైల మధ్య నిర్మితమవుతున్న బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌ పనులు 2021 సంవత్సరంలోనే ప్రారంభమయ్యాయి. లక్షా 8 వేల కోట్ల రూపాయలతో చేపడుతున్నారు. ఇందులో రూ.10 వేల కోట్లను కేంద్రం, మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రభుత్వాలు చెరో రూ.5 వేల కోట్లు భరిస్తున్నాయి. మిగతా సొమ్ము మొత్తం జపాన్‌ ప్రభుత్వం 0.1శాతం నామినల్‌ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించింది. 2026 నాటికి తొలి విడుతలో భాగంగా బిల్లిమోర-సూరత్‌ సెక్షన్‌ తొలుత పూర్తవనుంది.


ఈ రైలు కారిడార్‌ పొడవు 508.17 కిలోమీటర్లు. ఒకసారి ఈ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అహ్మదాబాద్‌ నుంచి ముంబైకి కేవలం రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్‌లో మొత్తం 8 స్టేషన్లు ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. బుల్లెట్‌ ట్రైన్‌ తొలి ట్రయల్స్‌ను 2026లో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్‌ ట్రైన్‌ పరుగులు పెడుతుందని, ఇది విమానం టేకాఫ్‌ అయ్యే వేగంతో సమానమని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులోకి వచ్చాక గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.


ట్విటర్‌లో పోస్ట్ చేసిన మంత్రి
అహ్మదాబాద్‌-ముంబై బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో కీలక ప్రక్రియ పూర్తయిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఇటీవల తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ ఖాతాలో షేర్‌ చేశారు. ‘బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో పురోగతి.. 251.40 కిలోమీటర్ల మేర పిల్లర్లు, 103.24 కి.మీ మేర ఎలివేటెడ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం’ అంటూ వీడియోను ట్వీట్ చేశారు. బాక్స్‌ గిర్డర్లు, సెగ్మెంటల్‌ గిర్డర్ల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. 






ఈ ప్రాజెక్ట్‌ను జాతీయ హై-స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పర్యవేక్షిస్తోంది. గుజరాత్‌లో వల్సాద్‌, నవ్‌సారి జిల్లాల్లోని ఆరు నదులపై వంతెనల నిర్మాణం పూర్తి చేసినట్లు ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ పేర్కొంది. ఫుల్‌ స్పాన్‌ లాంచింగ్ విధానంతో 100 కిలోమీటర్ల వయాడక్ట్‌ నిర్మాణాన్ని ఏడాది కాలంలో పూర్తి చేశామని, మెట్రో ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉపయోగించే స్పాన్‌-బై-స్పాన్‌ పద్ధతి కంటే పది రెట్లు వేగంగా పనులు జరుగుతున్నట్లు వెల్లడించింది.