ప్రతిరోజూ కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే కొందరు రైళ్లకు సంబంధించి నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో కంటెంట్ వైరల్ చేస్తున్నారు. దాంతో రైల్వే కార్యకలాపాలు, రూల్స్ గురించి తప్పుడు వీడియోలు, ఫేక్ న్యూస్, షార్ట్ రీల్స్‌ను ప్రచారం చేస్తున్న వ్లాగర్‌లపై దక్షిణ రైల్వే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికారిక సమాచారాన్ని అందిస్తున్నట్లుగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి, తద్వారా ప్రయాణికులు రైల్వే నిబంధనలను ఉల్లంఘించేందుకు ప్రోత్సహిస్తున్నారని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే వదిలేస్తే పరిస్థితి చేయి దాటుతుండడంతో చెన్నై డివిజన్ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, వ్లాగర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతోంది.

Continues below advertisement

తప్పుడు ప్రచారంతో రైల్వే సిబ్బందికి ఇబ్బందులురిజర్వేషన్ లేని సాధారణ టికెట్‌తో ఏసీ కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించవచ్చు అని, రిజర్వేషన్ లేకుండా ప్రయాణిస్తే కేవలం టికెట్ ధరతో పాటు అదనంగా ₹250 జరిమానా చెల్లిస్తే సరిపోతుందని వైరల్ అవుతున్న కంటెట్ లో వాస్తవం లేదని రైల్వేశాఖ తెలిపింది. అలాగే ప్లాట్‌ఫాం టికెట్ తప్పనిసరి కాదంటూ కొందరు అవాస్తవాలను వీడియోలు, రీల్స్, షార్ట్స్ ద్వారా ప్రచారం చేసి ప్రయాణికులను తప్పుదోవ పట్టిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇది నిజమని నమ్మి ప్రయాణికులు తరచుగా రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పరిస్థితి రోజురోజుకు తీవ్రమవడంతో వీటిపై చర్యలకు సిద్ధమైన రైల్వే అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అదే సమయంలో ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను ప్రారంభించారు.

తప్పుడు కంటెంట్‌ను తయారుచేసి, ప్రచారం చేస్తున్న వారిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, వ్లాగర్లు ఉన్నారని రైల్వేశాఖ గుర్తించింది. అటువంటి వ్యక్తుల జాబితాను రైల్వే అధికారులు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే వారిపై చర్యలు తీసుకోనున్నారు. తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి, రైల్వేశాఖ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఫ్యాక్ట్-చెక్ హ్యాండిల్‌ను కూడా ప్రారంభించింది. రైల్వే గురించి ఏదైనా తప్పుదారి పట్టించే సమాచారం ఉంటే, నెటిజన్లు ఈ హ్యాండిల్‌కు ట్యాగ్ చేయడం ద్వారా వారిని కంట్రోల్ చేయవచ్చు అని సలహా ఇచ్చింది. 

Continues below advertisement

రైల్వేస్టేషన్లలో వీడియోలపై ఆంక్షలురైల్వే నిబంధనల ప్రకారం, రైల్వే ప్రాంగణంలో ముందస్తు అనుమతి లేకుండా  వీడియోలు, వ్లాగ్‌లు లేదా ఫోటోలు తీయడం శిక్షార్హమైన నేరం. రీల్స్ కోసం ట్రాక్‌లపైకి వచ్చి ఉల్లంఘనలకు పాల్పడే వారిని సైతం అరికట్టాలని రైల్వే  అధికారులు భావిస్తున్నారు. స్టేషన్లు, యార్డులు, డిపోలు, దుకాణాల లోపల వీడియోలు, ఫోటోగ్రఫీకి సంబంధించిన పర్మిషన్ రూల్స్ మరింత కఠినతరం చేయనున్నారు.