Indian Railway Fare Hike | భారతదేశంలో నేటి నుంచి రైల్వే టికెట్ల ధరల పెంపు అమలులోకి వస్తుంది. ఇటీవల రైల్వేశాఖ సుదూర ప్రయాణాలపై టికెట్ ఛార్జీలు పెంచడం తెలిసిందే. ఈ సవరించిన రైళ్ల ఛార్జీలు ఈరోజు (శుక్రవారం) అంటే డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చాయి. దీని కోసం రైల్వే డిసెంబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రయాణికుల సౌకర్యం, నిర్వహణకు ఆర్థిక స్థిరత్వం మధ్య సమతుల్యత లక్ష్యంతో ప్రయాణీకుల ఛార్జీలలో హేతుబద్ధీకరణను ప్రకటించినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో, పెరిగిన ఛార్జీలు ఇప్పటికే బుక్ చేసుకున్న టిక్కెట్లకు కూడా వర్తిస్తాయా? డిసెంబర్ 26కు ముందు టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు ప్రయాణ సమయంలో అదనంగా డబ్బు చెల్లించాలా అని ఆలోచిస్తున్నారా. అయితే ఈ వివరాలు తెలుసుకోండి.
పెరిగిన ఛార్జీలు ఎప్పటి నుండి అమలులోకి వస్తాయి?
రైల్వేశాఖ సమాచారం ప్రకారం, ఇటీవల సవరించిన ఛార్జీలు డిసెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చేశాయి. ఇది ఈ తేదీ నుంచి బుక్ చేసుకున్న టిక్కెట్లకు మాత్రమే వర్తిస్తుంది. మీరు డిసెంబర్ 26కు ముందు టిక్కెట్ బుక్ చేసుకున్నట్లయితే, ఆ తర్వాత తేదీలలో ప్రయాణించాల్సి వచ్చినా, అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ కేటగిరీలలో ఛార్జీలు పెరగలేదు
సీజన్ టిక్కెట్ల ఛార్జీలలో ఎటువంటి మార్పు చేయలేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా, సెకండ్ క్లాస్ సాధారణంలో 215 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి సైతం ఎటువంటి ఛార్జీల పెరుగుదల లేదు.
దూరం ఆధారంగా అదనపు ఛార్జీలు
నాన్-ఏసీ సాధారణ రైళ్లలో పెరిగిన ఛార్జీలు దూరం ఆధారంగా వర్తిస్తాయి. ఉదాహరణకు, మీరు 216 కిమీ నుండి 750 కిమీ ప్రయాణానికి ₹5 పెరిగింది. 751 కిమీ నుండి 1250 కిమీ ప్రయాణానికి 10 రూపాయలు అదనంగా చెల్లించాలి. అదేవిధంగా, 1251 కిలోమీటర్ల నుంచి 1750 కిమీ ప్రయాణానికి 15 రూపాయలు, 1751 కిమీ నుండి 2250 కిమీ వరకు టిక్కెట్‌కు 20 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. స్లీపర్ క్లాస్, జనరల్, ఫస్ట్ క్లాస్ ప్రయాణాలలో కిలోమీటరుకు 1 పైసా చొప్పున ఛార్జీలు పెరిగాయి.
రైళ్ల ప్రకారం ఛార్జీలు ఎంత పెరిగాయి?
రైల్వే ప్రకారం, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ,యు ఏసీ రెండూ (స్లీపర్, ఫస్ట్ క్లాస్, ఏసీ చైర్ కార్, ఏసీ 3-టైర్, ఏసీ 2-టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్) కిలోమీటరుకు 2 పైసలు ఛార్జీలు పెరిగాయి. ఉదాహరణకు, 500 కిమీ నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ ప్రయాణానికి ప్రయాణికులు సుమారు ₹10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన ఛార్జీలు రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, సంపర్క్ క్రాంతి, జన శతాబ్ది, అంత్యోదయ, గతిమాన్, అమృత్ భారత్, గరీబ్ రథ్, యువ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ రాపిడ్ రైల్ తో సహా ఇతర ప్రధాన రైళ్లకు సమానంగా వర్తిస్తాయి.
రైల్వే తెలిపిన సమాచారం
అంతేకాకుండా రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్‌ఫాస్ట్ సర్ ఛార్జీలు, ఇతర సహాయక ఛార్జీలలో ఎటువంటి మార్పు చేయలేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. జీఎస్టీ రేట్లు, ఛార్జీల రౌండ్-ఆఫ్ నియమాలు కూడా యథాతథంగా ఉంటాయి. నేటి (డిసెంబర్ 26) నుంచి స్టేషన్లలో ప్రదర్శించే ఛార్జీల జాబితా కూడా కొత్త ఛార్జీల ప్రకారం మాడిఫై చేయనున్నారు.