Indian Navy Intense Operation: భార‌త నేవీ(Indian Navy). దేశ త్రివిధ ద‌ళాల్లో ఒక‌టి. స‌ముద్ర జ‌లాల ప‌రిర‌క్ష‌ణ కీల‌క బాధ్య‌త‌. అయితే.. ఇటీవ‌ల కాలంలో కేవ‌లం స‌ముద్ర జలాల(Sea water) ర‌క్ష‌ణ‌కే ప‌రిమితం కావ‌డం లేదు. డ్ర‌గ్స్ ర‌వాణా స‌హా ఇత‌ర‌త్రా అక్ర‌మ ర‌వాణాల‌ను కూడా క‌ట్ట‌డి చేస్తూ.. దేశ భ‌ద్ర‌త‌లో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ప్ర‌పంచ స్థాయిలో జ‌రుగుతున్న ప‌లు ప‌రిణామాల కార‌ణంగా.. దొడ్డిదారిలో స‌ముద్ర జ‌లాల‌ను ఆస‌రాగా చేసుకుని దేశంలో చొర‌బ‌డుతున్న వారిని కూడా అడ్డుకుంటోంది. ఇక‌, భార‌త శ‌త్రు దేశాలు స‌ముద్ర జ‌లాల‌ను అడ్డు పెట్టుకుని సాగిస్తున్న ఉగ్ర‌వాద కార్య‌క్ర‌మాల‌కు కూడా చెక్ పెడుతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా భార‌త నౌకలను దోచుకునేందుకు ప్ర‌య‌త్నించిన స‌ముద్ర దొంగ‌ల‌(Pirates)ను కూడా భార‌త నేవీ ద‌ళాలు అడ్డుకుని.. వారి ఆట‌క‌ట్టించాయి. ఈ క్ర‌మంలో దొంగ‌లు దోపిడీకి య‌త్నించిన నౌక‌లోని సిబ్బందిని కాపాడడంతోపాటు.. మొత్తం 35 మంది స‌ముద్ర దొంగ‌ల‌ను కూడా భార‌త నేవీ అరెస్టు చేసింది. భార‌త నేవీ సాహ‌సోపేతంగా ఛేదించిన ఈ ఆప‌రేష‌న్‌ను భారత నౌకాదళం ఎక్స్‌లో పోస్టు చేసింది. 


ఏం జ‌రిగింది? 


అంతర్జాతీయ జలాల్లో శాంతి(Peace), స్థిరత్వాలను(Stability) బలోపేతం చేయడం సహా దోపిడీని అడ్డుకోవడంలో భారత నేవీ బలగాలు నిబద్ధతను చాటుతున్నాయి. తాజాగా సముద్ర దొంగలు MV రుయెన్‌ వాణిజ్య నౌకను హైజాక్ చేశారు. దీనిలోని సొత్తును దోచుకునేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. ఈ విష‌యంపై స‌మాచారం తెలియ‌డంతో హుటాహుటిన రంగంలోకి దిగిన భార‌త నేవీ ద‌ళాలు సముద్రపు దొంగల చెర నుంచి  MV రుయెన్‌ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకోవ‌డంతోపాటు.. దానిలోని సిబ్బందిని కూడా ర‌క్షించారు. అంతేకాదు.. ఆ నౌకలోని 35 మంది సముద్రపు దొంగలను భారత నేవీ అధికారులు అరెస్టు చేశారు. 17 మంది సిబ్బందిని కాపాడారు. భారత యుద్ధ నౌక `INS కోల్‌కతా`లో వెళ్లిన ఇండియన్‌ నేవీ అధికారులు ఈ ఆపరేషన్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌డం గ‌మ‌నార్హం. దీనిలో భాగంగా ప్యాసెంజ‌ర్‌ విమానం C-17 గ్లోబ్‌మాస్టర్‌(C-17 Globe master) నుంచి ధైర్యంగా పారాచూట్‌ల సాయంతో సముద్ర ఉపరితలంపైకి నేవీ కమాండోలు దూకారు. అనంతరం ప్రత్యేకమైన బోట్లలో హైజాక్‌ అయిన నౌక వద్దకు చేరుకున్నారు. ఆ నౌకను దొంగల చెర నుంచి విడిపించడంతోపాటు సిబ్బందిని సుర‌క్షితంగా కాపాడారు. హైజాక్‌కు గురైన నౌక‌లోని రూ.8 కోట్లకుపైగా విలువైన 37,800 టన్నుల సామగ్రిని కాపాడారు. అదేస‌మయంలో నౌకను బందీలు, సిబ్బందితో సహా ఇండియన్ ప‌శ్చిమ తీరానికి తీసుకొచ్చారు. ఈ నౌకలో భారీగా ఉక్కు ఉన్నట్లు పేర్కొన్నారు. వైమానిక, నౌకాదళాల ఉమ్మడి కార్యాచరణ శక్తిసామర్థ్యాలను ఈ విజయం ప్రదర్శిస్తోందని నేవీ తెలిపింది. 


గ‌తంలోనూ అనేక విజ‌యాలు


+ గ‌తంలోనూ భార‌త నేవీ అనేక విజ‌యాలు సాధించింది.  ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై కొంతకాలం గా హూతీ తిరుగుబాటుదారుల దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జలమార్గాలపై నిఘా ఉంచేందుకు నౌకాదళం 10కి పైగా యుద్ధనౌకలను మోహరించి.. ర‌క్ష‌ణ‌గా నిలుస్తోంది. 


+ హిందూ మహాసముద్రం(Indian ocean)లోని ప‌శ్చిమ తీరంలో గత కొన్ని వారాలుగా పలు వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత నౌకాదళం అడ్డుకొని వాటిలోని సిబ్బందిని రక్షించింది.


+ సోమాలియా(Somalia) తూర్పు తీరం వెంట జనవరిలో 19 మంది పాక్‌ సిబ్బందితో వెళ్తున్న నౌకపై దాడి జరగ్గా అందులోని సిబ్బందిని భారత నేవీ ఐఎన్‌ఎస్‌ సుమిత్రా యుద్ధనౌక ద్వారా కాపాడింది. 


+ జనవరి 5న లైబీరియన్‌ జెండాతో అరేబియా సముద్రంలో వెళ్తున్న నౌకను హైజాక్‌ చేసేందుకు సముద్రపు దొంగలు ప్ర‌య‌త్నించారు. ఈ ప్ర‌య‌త్నాల‌ను కూడా భార‌త నేవీ నిలువరించింది. 


+ కీలకమైన సముద్రమార్గాలను దృష్టిలో పెట్టుకొని భారత నౌకాదళం(Indian navy) ఫ్రంట్‌లైన్‌ నౌకలు, నిఘా విమానాలతో సముద్ర భద్రతను మ‌రింత పెంచ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ల‌క్ష‌ద్వీప్‌లోనూ నిఘాను ముమ్మ‌రం చేసింది.