Indian Illegal Migrants Sent Back From US: అక్రమ వలసదారులను అమావీయరీతిలో తమ దేశం నుంచి అమెరికా వెళ్లగొడుతోంది. అమెరికా నుంచి 104 మందిని ఇండియాకు వచ్చేశారు. వారు చెబుతున్న విషయాలు సంచలనంగా మారుతున్నాయి. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా రాయబార కార్యాలయం చేపట్టిన చర్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి.  

మొదట అక్రమ వలదారులుగా గుర్తించిన వారిని ప్రత్యేక క్యాంపులకు తరలించారు. అక్కడ వారిని ఎవరితో మాట్లాడనీయకుండా పూర్తిగా కట్టుదిట్టం చేశారు. అక్కడి నుంచి స్వదేశాలకు పంపేస్తున్నట్టు చెప్పారు. విమానంలో వారిని కూర్చోబెట్టి కాళ్లు చేతులను గొలుసులతో కట్టేసి ఉంచారరు. స్వదేశంలో దిగే వరకు అలానే ఉంచారని మొదటి బ్యాచ్‌లో వచ్చిన భారతీయులు చెబుతున్నారు.  

ఇదంతా తప్పుడు ప్రచారమని కేంద్రం కొట్టిపారేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫొటోలను ఫేక్‌ అంటూ కొట్టిపారేసింది. బాధితులు మాత్రం తమను గొలుసులతో కట్టేసి తీసుకొచ్చారని మీడియాతో మాట్లాడుతూ చెబుతున్నారు. ఇప్పుడు ఇది రాజకీయ దుమారం రేపుతోంది. భారతీయుల పట్ల అమెరికా ఇంత అవమానకర రీతిలో ఉంటే కేంద్రం ఏం చేస్తోందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.  

అమెరికా నుంచి తొలి బ్యాచ్‌లో 104 మంది భారతీయులు వచ్చారు. వీరిలో హర్యానా, గుజరాత్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, ఛండీగఢ్‌కు చెందిన వారు ఉన్నారు. వీరిలో 25 మంది మహిళలు, 12 మంది మైనర్లు ఉన్నారు. 48 మంది 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. 

పంజాబ్‌లోని ఫతేఘర్ చురియన్‌కు చెందిన జస్పాల్ సింగ్ 2024 ఫిబ్రవరి 24న అమెరికాలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే కలతో భారత్‌ నుంచి వలస వెళ్లాడు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు బహిష్కరణకు గురయ్యాడు. అమెరికా సైనిక విమానంలో వచ్చిన అక్రమ వలసదారుల్లో ఈయన ఒకరు. చట్టబద్ధంగా స్థిరపడాలనుకున్నాడు. ఏజెంట్‌కు రూ.30 లక్షలు ఇచ్చాడు. కానీ మోసం పోయాడు. మొదట పంజాబ్ నుంచి యూరప్, అక్కడి నుంచి డంకీ మార్గంలో  బ్రెజిల్ వెళ్ళాడు. 

అమెరికా చేరుకోవడానికి జస్పాల్ సింగ్‌కు 6 నెలలు పట్టింది. సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించగానే అక్కడ పెట్రోలింగ్ పోలీసులకు చిక్కి అరెస్టు అయ్యాడు. 11 రోజుల పాటు కస్టడీలో ఉంచున్న అమెరికా పోలీసులు తర్వాత స్వదేశానికి పంపించారు. తనను అమెరికా నుంచి సంకెళ్లు వేసి పంపించారని జస్పాల్ చెప్పాడు. అమృత్‌సర్ చేరుకునే ముందు సంకెళ్లు తొలగించారట.  

IANS నివేదిక ప్రకారం, వీళ్లను టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుంచి సి-17 విమానంలో భారతదేశానికి తరలించారు. అమెరికా ఇలా వ్యవహరించడం పట్ల పంజాబ్ ఎన్నారై వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ నిరాశ వ్యక్తం చేశారు. "అమెరికన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి వలసదారులు దోహదపడుతున్నారని, కాబట్టి వారికి అమెరికాలో శాశ్వత పౌరసత్వం ఇవ్వాలే తప్ప బహిష్కరించకూడదు" అని ఆయన అన్నారు.

గత నెలలో, అక్రమ వలసదారుల సమస్యపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ "చరిత్రలో తొలిసారిగా అక్రమ వలసదారులను పట్టుకుని, సైనిక విమానంలో వారి దేశాలకు తిరిగి పంపుతాము" అని అన్నారు.

ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం అమెరికాలో దాదాపు 7,25,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారు. మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న మూడవ అతిపెద్ద జనాభా భారతీయులే.