Pakistan In Big Trouble | న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో దాయాది పాక్ నడ్డి విరిచేదుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నుంచి అన్ని దిగుమతులను భారత ప్రభుత్వం నిషేధించింది. జాతీయ భద్రత, పబ్లిక్ పాలసీ దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం స్పష్టం చేసింది. దాంతో ఇకనుంచి పాకిస్తాన్ నుంచి భారత్ ఎలాంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోదు. ఒకవేళ ఏదైనా ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలంటే మాత్రం కచ్చితంగా భారత ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. 

పాక్ వస్తువులపై భారత్‌లో నిషేధం

"పాకిస్తాన్‌లో లభించే లేదా తయారయ్యే అన్ని  వస్తువులపై నిషేధం విధిస్తున్నాం. ఇకనుంచి పాకిస్తాన్ నుంచి భారత్ ఎలాంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోదు. ప్రత్యక్షంగా, పరోక్షంగానూ పాక్ నుంచి ఎలాంటి వస్తువులు భారత్ దిగుమతి చేసుకోదు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పాక్ వస్తువులపై నిషేధం తక్షణమే అమలులోకి రానుంది. ఉగ్రదాడి ఉద్రికత్తల పరిస్థితుల్లో జాతీయ భద్రత, పబ్లిక్ పాలసీ దృష్ట్యా పాక్ నుంచి ఏ వస్తువులు మన దేశం దిగుమతి చేసుకోకుండా నిషేధం అమల్లోకి వస్తుంది.  ఈ నిషేధం నుంచి ఏమైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి" అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది.

పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఏకైక రోడ్డు, వాణిజ్య మార్గం అయిన వాఘా-అట్టారీ సరిహద్దు ఇప్పటికే మూసివేశారు. పాకిస్తాన్ నౌకలు భారత ఓడరేవులలో నిలపడాన్ని సైతం కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిషేధించింది. దాంతో పాక్ నుంచి ఏ విధంగానూ భారత్‌కు ఎగమతులు జరగకుండా చూడాలని కేంద్రం మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. దాంతో వాణిజ్యం జరగక పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారనుంది. 

పుల్వామా దాడి తరువాత 200 శాతం టారిఫ్ విధించిన భారత్

 పాకిస్తాన్ నుండి భారత్ దిగుమతుల్లో ప్రధానంగా పండ్లు, నూనెగింజలు, ఔషధ ఉత్పత్తులు, రాక్ సాల్ట్, కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. 2019 పుల్వామా దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ ఉత్పత్తులపై 200 శాతం టారిఫ్ విధించడంతో పాక్ నుంచి దిగుమతులు తగ్గాయి. 2024-25లో మొత్తం దిగుమతుల్లో పాక్ నుంచి 0.0001 శాతం కంటే తక్కువగా ఉన్నాయని నివేదికలు వెల్లడించాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సంస్థల నుంచి సైతం ఎలాంటి రుణాలు రాకుండా చేయాలని భావిస్తోంది భారత ప్రభుత్వం.

పాక్ నుంచి దిగుమతులపై పూర్తి స్థాయిలో భారత్  నిషేధం విధించడం ఆ దేశానికి ఆర్థికంగా భారీ నష్టమే. 2023-24లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య   రూ. 3,886.53 కోట్ల బిజినెస్ జరిగింది. గత 5 సంవత్సరాలలో ఇదే అత్యధికం. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ వస్తువులపై కేంద్రం 200 శాతం విధించడంతో పాక్ వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలోని బైసరన్ లోయలో మైదానంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నేపాల్ పర్యాటకుడు సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో పాక్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేలా భారత్ నిర్ణయాలు తీసుకుంటోంది. భారత్ నుంచి వారికి ఎలాంటి సాయం అందకుండా ఒక్కో విభాగంలో చర్యలు తీసుకుంటూ అష్టదిగ్బంధం చేస్తోంది.