India Vs Pakistan: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(UNO Assembly) 79వ సమావేశాలు న్యూయార్క్ లో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భారత్(India ని టార్గెట్ చేయాలని చూసింది పాకిస్తాన్(Pakistan). పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. పాలస్తీనా ప్రజలలాగే.. జమ్మూ కాశ్మీర్‌(Kashmir) ప్రజలు కూడా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని, తమకు నిర్ణయాధికారం కావాలని వారు అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దు గురించి ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. శాంతిస్థాపన కోసం అంటూ 2019 ఆగస్టులో భారత్‌ ఏకపక్షంగా కొన్ని చర్యలు చేపట్టిందని, అవి చట్ట విరుద్ధం అని అన్నారు. ఆ చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు షెహబాజ్ షరీప్. ఐక్యరాజ్యసమితి భద్రతా తీర్మానాలకు అనుగుణంగా కాశ్మీర్‌ సమస్యని ఓ కొలిక్కి తేవాలని, శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరపాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు వెంటనే భారత ప్రతినిధి కౌంటర్ ఇచ్చారు. పాక్ ప్రధాని మాటలన్నీ అవాస్తవాలన్నారు భారతీయ దౌత్యవేత్త భవిక మంగళానందన్. 






మిలట్రీ చేతుల్లో అధికారాలు పెట్టిన ఆ దేశం, టెర్రరిజంకి కేరాఫ్ అడ్రస్ అని ప్రపంచం మొత్తం వేలెత్తి చూపిస్తున్న దేశం, డ్రగ్స్, అక్రమ ఆయుధాల వ్యాపారాలకు పేరుబడిన దేశం.. అలాంటి పాకిస్తాన్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ని విమర్శించాలనుకోవడం హాస్యాస్పదం అని అన్నారు భవిక మంగళానందన్. ఇలాంటి ప్రపంచ వేదికపై దురదృష్టవశాత్తు అబద్ధాలు వినాల్సి వస్తోందన్నారు. పాక్ ప్రధాని చెప్పిన ప్రతి మాటా అవాస్తవమేనని కొట్టిపారేశారు. హింస గురించి పాకిస్తాన్ మాట్లాడటం హాస్యాస్పదం అన్నారామె. ఎన్నికల్లో రిగ్గింగ్ అక్కడ సహజం అని, అలాంటి దేశం ప్రజాస్వామ్యానికి పెట్టనికోటగా ఉన్న భారత్ గురించి మాట్లాడమేంటని ప్రశ్నించారు. పాకిస్తాన్ తమ దేశ భూభాగం కోరుకుంటోందని, జమ్మూకాశ్మీర్ లో జరగబోతున్న ఎన్నికలకు విఘాతం కలిగించేందుకే ఇప్పుడీ అంశాన్ని లేవనెత్తిందని వివరించారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించి, కాశ్మీర్ లో శాంతి భద్రతలు లేకుండా చేయాలనేదే వారి ఆలోచన అని విమర్శించారు భవిక. 


1971లో పాకిస్తాన్ మారణహోమానికి పాల్పడిందని.. అక్కడ ఇప్పటికీ మైనార్టీలకు రక్షణ లేదని చెప్పారు భవిక. మైనార్టీ ప్రజల్ని నిర్ధాక్షిణ్యంగా హింసించే దేశం పాకిస్తాన్ అని విమర్శించారు. ప్రజల్లో అసహనం, భయాందోళనల గురించి ఆ దేశ ప్రధాని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒసామా బిన్ లాడెన్ కి ఆశ్రయం ఇచ్చిన దేశం పాకిస్తాన్ అని, ప్రపంచవ్యాప్తంగా అనేక ఉగ్రవాద సంఘటనలపై పాకిస్తాన్ ముద్ర ఉందని చెప్పారు. ఉగ్రవాద మూకలకు ఆశ్రయం ఇస్తూ, వారికి ఆవాసంగా మారిన దేశం పాకిస్తాన్ అని గుర్తు చేశారు భవిక. 


ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో న్యూయార్క్ లోని UNO జనరల్ అసెంబ్లీ హాల్‌లో సమావేశాలు జరుగుతాయి. సభ్యదేశాల అధినేతలు, ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈసారి జమ్మూకాశ్మీర్ లో ఎన్నికల సందర్భంగా.. పాక్ ప్రధాని షెహబాజ్ మన దేశంపై నిందలు వేయాలని చూశారు. ప్రపంచ దేశాల ముందు భారత్ ని నిలదీయాలనుకున్నారు. అయితే అదే సమయంలో పాక్ పరువు తీశారు భారత డిప్లొమాట్ భవిక. భవిక ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ గొప్పదనం గురించి వివరిస్తూ, అదే సమయంలో పాకిస్తాన్ ని టెర్రరిస్ట్ దేశంగా ప్రపంచానికి మరోసారి గుర్తు చేశారు భవిక. అలాంటి దేశానికి తమ గురించి, తమ దేశంలోని అంతర్భాగం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వాస్తవానికి పాకిస్తాన్ అనేక అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోలేని పరిస్థితిలో ఉంది. అయితే ఎంతసేపు దాయాది దేశంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నా పాకిస్తాన్ ప్రధాని.. ఐక్యరాజ్యసమితిలో అసందర్భంగా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు 20నిమిషాల తన ప్రసంగంలో కాశ్మీర్ వ్యవహారంపై చర్చ జరగాలని, అక్కడి ప్రజలకు స్వేచ్ఛనివ్వాలని పట్టుబట్టారు. అయితే భారత దౌత్యవేత్త ఘాటు సమాధానంతో పాక్ తోక ముడిచినట్టయింది. 


Also Read: అమెరికాను వణికిస్తున్న హెలీన్ హరికేన్‌.. 44 మందికి పైగా మృతి.. అంధకారంలో 45 లక్షల ఇళ్లు