Indian Cargo Vessel Haji Ali Sinks: అంతర్జాతీయ సముద్ర జలాల్లో వాణిజ్య నౌకలపై దాడులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి లోడ్‌తో వెళ్తున్న భారత సరుకు రవాణా నౌక హాజీ అలీ పై మే 13న ఒమన్ తీరానికి సమీపంలో దాడి జరిగింది. గుజరాత్‌లోని దేవభూమి ద్వారకా జిల్లా సలాయా పోర్టులో రిజిస్టర్ అయిన ఈ నౌక, ఒమన్‌లోని లిమా తీరానికి చేరుకోగానే డ్రోన్ లేదా క్షిపణి వంటి పేలుడు పదార్థం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నౌకలో భారీగా మంటలు చెలరేగి, క్రమంగా బ్యాలెన్స్ కోల్పోయి సముద్రంలో మునిగిపోయింది.
ఈ ఘోర ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. నౌక మునిగిపోతున్న క్రమంలో అప్రమత్తమైన ఒమన్ కోస్ట్ గార్డ్ అధికారులు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టి, సిబ్బంది అందరినీ సురక్షితంగా రక్షించి దిబ్బా పోర్టుకు తరలించారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలు , నావికులను లక్ష్యంగా చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అంతర్జాతీయ నిబంధనలకు ఇది విరుద్ధమని భారత్ స్పష్టం చేసింది. తమ పౌరులను రక్షించినందుకు ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది.
పశ్చిమాసియాలో గత ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారత నౌకపై దాడి జరగడం ఇది మూడోసారి. హోర్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో ఇరాన్ ఆంక్షలు కఠినతరం చేయడం, మరోవైపు అమెరికా నౌకాదళ దిగ్బంధనం వంటి పరిణామాల మధ్య సముద్ర ప్రయాణాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ ఉద్రిక్తతల వల్ల చమురు , సహజ వాయువు రవాణా ఖర్చులు పెరిగి భారత్ వంటి దిగుమతి దేశాలపై అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం బ్రిక్స్ సమావేశాల కోసం భారత్ వచ్చిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఈ ఘటనపై నేరుగా స్పందించనప్పటికీ, తమ నౌకాదళానికి సహకరించే నౌకలకు హోర్ముజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉంటుందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతానికి ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే, వరుసగా జరుగుతున్న ఇటువంటి దాడులు భారత నౌకాయాన రంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. సముద్ర మార్గాల్లో భారతీయ నావికుల భద్రతను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దౌత్యపరమైన చర్చలను ముమ్మరం చేసింది. కోర్టు విచారణలు, రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా, అంతర్జాతీయ సరిహద్దుల్లో భారతీయుల ప్రాణాలకు రక్షణ కల్పించడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతగా మారింది.
