PM Modi at IECC Complex in Pragati Maidan: :
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ దీమా వ్యక్తం చేశారు. తాను మూడోసారి భారత ప్రధానిగా ఉన్న సమయంలో మన దేశం ప్రపంచంలోని టాప్‌ త్రీ ఎకానమీలలో ఒకటిగా నిలుస్తుందన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో బుధవారం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ) కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఐఈసీసీ కాంప్లెక్స్ ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ కన్వెన్షన్‌ సెంటర్‌కు ‘భారత్‌ మండపం’గా నామకరణం చేశారు.


సుమారు రూ. 2,700 కోట్ల వ్యయంతో కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేశారు. ఈ కన్వెన్షన్ సెంటర్ దాదాపు 123 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ‘జీ-20’ శిఖరాగ్ర సదస్సుకు భారత్ మండపం వేదిక కావడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వస్తుందని, అప్పుడు భారత్ ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. 






ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లిలాంటిదనే విషయాన్ని ప్రపంచ దేశాలన్ని అంగీకరిస్తాయి అన్నారు మోదీ. ఐఈసీసీ కన్వెన్షన్‌ సెంటర్‌ ‘భారత్‌ మండపం’ ప్రపంచానికి మన సత్తా చాటి చెబుతుందన్నారు. దేశ ప్రజలు గొప్పగా ఆలోచించండి, గొప్ప కలలు కనాలి, అందుకు తగినట్లుగా పనులను చేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కానీ దేశంలో కొన్ని వ్యతిరేక శక్తులు జాతి అభివృద్ధిని అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. నూతన పార్లమెంటు భవనం గురించి మనం గొప్పగా చెప్పుకోవాలన్నారు.