India US Trade Deal: రష్యా చమురు కొనడం భారత్ ఆపేస్తుందా? ట్రంప్ కండీషన్‌కు ప్రధాని మోదీ ఓకే చేశారా!
PM Modi | భారత్- అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. రష్యా నుండి చమురు కొనకూడదని ట్రంప్ షరతు పెట్టారు. 25 శాతం అదనపు టారిఫ్ నుంచి ఉపశమనం పొందాలంటే భారత్ పాటించాల్సి వస్తుంది.

భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కు అంగీకారం జరిగిన తరువాత రష్యా చమురు కొనుగోలు హాట్ టాపిక్ అవుతోంది. అయితే రష్యా ముడి చమురును కొనడం పూర్తిగా ఆపివేయడం వల్ల ఇండియాకు సమస్యలు ఏర్పడవచ్చు. రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఫిబ్రవరి 3 తన నివేదికలో, భారత్ ఇటీవల నెలల్లో రష్యా నుండి ముడి చమురును కొనడం క్రమంగా తగ్గించిందని పేర్కొంది. అందుకు అమెరికానే కారణం అని తెలిసిందే. అయితే పూర్తి కొనుగోళ్లను ఒక్కసారిగా నిలిపివేస్తే ఆర్థికాభివృద్ధికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది దేశంలో సరఫరా లోటుకు కారణంగా మారవచ్చు. చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపవచ్చు అని కొందరు నిపుణులు అంచనా వేశారు. ఎందుకంటే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారులలో ఒకటి.
భారత్ వెంటనే రష్యా చమురును కొనడం ఆపదు
అమెరికాతో డీల్ కోసం భారత్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. రష్యా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి చౌక ధరకు ముడి చమురు కొనడం సవాల్‌గా మారనుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ధరల పెరుగుదలకు కారణం అవుతుందని, భారత్ వంటి అతిపెద్ద దిగుమతి చేసుకునే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని మూడీస్ స్పష్టంగా పేర్కొంది. ఆర్థికాభివృద్ధిలో ఇబ్బందులను నివారించడానికి భారతదేశం వెంటనే అన్ని రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను ఆపివేసే అవకాశం లేదని ఏజెన్సీ తెలిపింది.
అమెరికా భారత వస్తువులపై టారిఫ్ 50 శాతం నుండి 18 శాతానికి తగ్గించిన వాణిజ్య ఒప్పందం కోసం వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ త్వరలో రష్యా చమురును కొనడం ఆపివేస్తుందన్నారు. ఇకనుంచి వెనిజులా నుండి ఎక్కువ చమురును కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. భారత్ అమెరికా నుండి 500 బిలియన్ డాలర్లకు పైగా ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని, ఇందులో ముడి చమురు కూడా ఉంటుందని ట్రంప్ అన్నారు. అయితే, ప్రధాని మోదీ మాత్రం టారిఫ్ తగ్గించడంపై మాత్రమే మాట్లాడారు. కానీ రష్యా చమురును ఆపివేయడం గురించి స్పష్టత ఇవ్వలేదు.
రష్యా చమురు కొనుగోలును ఆపివేయడానికి భారత్ ఓకే..
రష్యా చమురు కొనుగోలు కారణంగా విధించిన అదనపు 25 శాతం పెనాల్టీ సుంకాన్ని తొలగించారని, అలాంటి కొనుగోళ్లను ఆపివేయడానికి భారత్ అంగీకరించిందని వైట్ హౌస్ అధికారి పేర్కొన్నారు. అయితే, మూడీస్ విశ్లేషణ ప్రకారం, భారత్ ఈ మార్పును నెమ్మదిగా అమలు చేస్తుంది, ఎందుకంటే తక్షణ మార్పు భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ఈ ఒప్పందం ఆభరణాలు, రత్నాలు, టెక్స్‌టైల్ వంటి రంగాలలో భారత ఎగుమతులకు ప్రయోజనం చేకూరుస్తుంది, ఎందుకంటే అమెరికా భారత్‌కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్. డీల్ ప్రకటన తర్వాత, స్టాక్ మార్కెట్లో జోరు కనిపించింది. నిఫ్టీ దాదాపు 3 శాతం పెరగగా, రూపాయి బలపడి డాలర్‌కు 90.40 వద్దకు చేరుకుంది.
భారత్, అమెరికా సంబంధాలు మెరుగు
భారత్, అమెరికా మధ్య ఈ ఒప్పందం గతంలో ఉన్న ఉద్రిక్తతలను తగ్గిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేరుతుంది. అయితే, రష్యా చమురుపై ఆధారపడటాన్ని తగ్గించే నిర్ణయం భారత ఇంధన అవసరాలు, ప్రపంచ మార్కెట్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి, ద్రవ్యోల్బణంపై ప్రభావాన్ని తగ్గించడానికి భారత్ ఆచూతూచి జాగ్రత్తగా అడుగులు వేస్తుందని మూడీస్ పేర్కొంది.























