Gaganyaan Crew Module: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో బృహత్తర ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాల విజయవంతంతో ఇస్రో అంతరిక్ష ప్రయోగాలపై రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తోంది. ఇందులో భాగంగానే అంత‌రిక్షంలోకి వ్యోమ‌గాముల్ని పంపేందుకు ప్రయ‌త్నాలు చేస్తోంది. దీని కోసం గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టును చేప‌ట్టింది. ఈ ప్రాజెక్టులో క్రూ మాడ్యుల్ అత్యంత కీలకమని ఇస్రో ప్రకటించింది. నింగిలోకి వ్యోమగాములు వెళ్లి రావడానికి క్రూ మాడ్యుల్ అత్యంత కీలకం. ఈ మేరకు క్రూ మాడ్యూల్ ప‌రీక్షకు ఇస్రో సిద్ధమవుతోంది. త్వరలోనే క్రూ మాడ్యూల్‌ను ఇస్రో ప‌రీక్షించ‌బోతోంది. 






గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌కు చెందిన టెస్ట్ వెహిక‌ల్ అబోర్ట్ మిష‌న్-1(టీవీ-డీ1) రూపుదిద్దుకుంది. టీవీ-డీ1 మాడ్యూల్‌ను లాంచింగ్ కాంప్లెక్స్‌కు చేర్చారు. టీవీ-డీ1మాడ్యూల్ నిర్మాణం తుది ద‌శ‌లో ఉన్నట్లు ఇస్రో తెలిపింది. ఈ మాడ్యూల్ 17 కిలోమీట‌ర్ల ఎత్తుకు వెళ్లిన త‌ర్వాత‌.. అబార్ట్ సీక్వెన్స్‌లో భాగంగా మ‌ళ్లీ భూమి మీద‌కు వ‌స్తుంది. పారాచూట్ల సాయంతో అది దిగుతుంది. శ్రీహ‌రికోట నుంచి 10 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స‌ముద్ర ప్రాంతంలో ఆ మాడ్యూల్ ల్యాండ్‌ అవుతుంది. ఆ మాడ్యూల్‌కు చెందిన ఫొటోల‌ను ఇస్రో త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసింది. 


క్రూ మాడ్యూల్ పీడ‌నం ఉండదు. వాటిలోనే వ్యోమ‌గాములు నింగిలోకి వెళ్తారు. అయితే ప్రస్తుతం టెస్టింగ్ కోసం ఆ మాడ్యూల్‌ను నింగిలోకి పంపి, మ‌ళ్లీ భూమిపై దించ‌నున్నారు. ఈ ప‌రీక్ష స‌మ‌యంలో క్రూ మాడ్యూల్ బంగాళాఖాతంలో ల్యాండ్ అవుతుంది. స‌ముద్రం నుంచి ఇండియ‌న్ నేవీ ఆ మాడ్యూల్ మెష‌న్‌ను తీసుకురానున్నట్లు ఇస్రో ఒక ప్రక‌ట‌న‌లో తెలిపింది. ప్రస్తుతం క్రూ మాడ్యూల్‌ను బెంగుళూరులోని ఇస్రో సెంట‌ర్‌లో టెస్టింగ్ చేశారు. టెస్ట్ ఫ్లయిట్ స‌క్సెస్ అయిన త‌ర్వాత గ‌గ‌న్‌యాన్ మిష‌న్ చేప‌ట్టనున్నారు.


చంద్రయాన్-3పై ఆశలు లేవు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు ఇక మేల్కొంటాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. ల్యాండర్, రోవర్ లు ఇంకా నిద్రాణస్థితి నుంచి బయటకు రావడం లేదని, సెప్టెంబర్ 22వ తేదీన చంద్రుడిపై సూర్యోదయం అయినప్పటికీ ల్యాండర్, రోవర్లు ఇంకా మేల్కొవడం లేదన్నారు. ఇస్రో వాటిని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తున్నా.. ఫలితం లేదన్నారు. భారత్ ప్రతిష్టాత్మకంగా పంపిన చంద్రయాన్-3 ప్రాజెక్టు ఇక ముగిసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. 


ఒక వేళ మేల్కోవాల్సి ఉంటే ఇప్పటికే అది జరిగి ఉండేదన్నారు. ఇక విక్రమ్, ప్రజ్ఞాన్ నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని అన్నారు. చంద్రయాన్-3 నుంచి అనుకున్న ఫలితం ఇప్పటికే వచ్చిందని, ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 కాలుమోపిందని స్పేస్ కమిషన్ మెంబర్ అయిన ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి ఎంతో విలువైన సమాచారం ఇస్రోకు అందిందన్నారు. ఆ సమాచారం కచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పారు. తదుపరి చేపట్టే ప్రాజెక్టుల్లో విజ్ఞానపరంగా, ప్లానింగ్ పరంగా ఆ ప్రాంతానికి సంబంధించి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని కిరణ్ కుమార్ తెలిపారు.