PM Viksit Bharat Rozgar Yojana :భారత్‌లో ఉన్న నిరుద్యోగ సమస్యను అధిగమించి యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్రం అనేక రకాల పథకాలు తీసుకొస్తోంది. ఇందులో వివిధ వర్గాలకు వివిధ పథకాలు అందిస్తోంది. ఈ ఆగస్టు నుంచి మరో కొత్త స్కీమ్ అమలుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. ఉపాధి-సంబంధిత ప్రోత్సాహక (Employment-Linked Incentive - ELI) యోజనను అప్‌డేట్ చేసి సరికొత్తగా అమలు చేయనుంది. దీనికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) అని పేరు పెట్టింది. ఆగస్టు 1 నుంచి అమలు అయ్యే ఈ పథకం 2027 జులై వరకు ఉంటుంది.
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) ఉపాధి సంక్షోభాన్ని అధిగమించి యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు 2025లో తీసుకొచ్చింది. జూలై 2025లో కేంద్ర మంత్రివర్గం దీనిని రూ. 99,446 కోట్ల బడ్జెట్‌తో ఆమోదించింది. ఈ యోజన ఆగస్టు 1 నుంచి అమలులోకి రానుంది. 2027 జూలై 31 వరకు కొనసాగుతుంది. దీని లక్ష్యం రెండేళ్లలో 3.5 కోట్లకుపైగా ఉపాధి అవకాశాలను సృష్టించడం.
PM-VBRY ప్రధాన లక్ష్యాలు
తయారీ రంగంపై ఎక్కువ ఫోకస్ చేసిన కేంద్రం వాటిని మరింతగా ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్‌తీసుకొచ్చింది. ఈ రంగంలో పెట్టుబడి పెట్టిన వాళ్లకు, ఉద్యోగాల్లో చేరిన వారికి ఈ నగదు ప్రోత్సాహకాలను అందివ్వబోతోంది. ఈలక్ష్యంతోనే PM-VBRYను అప్‌డేట్ చేసి అమలు చేయబోతున్నారు.
PM-VBRY ఎన్నిరకాలు
PM-VBRY ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి ఉద్యోగాల్లో చేసిన వారికి ఇచ్చే ప్రోత్సాహకం ఒకటి అయితే. రెండోది ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలను ప్రోత్సహించేందుకు అమలు చేసే పథకం రెండోది. రెండింటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.
ఉద్యోగులకు ప్రోత్సాహకం (Part A): కొత్తగా ఉపాధి పొందిన ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందించడం.
ఉపాధి సృష్టించే కంపెనీలకు ప్రోత్సాహకం (Part B): కొత్త ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలను, సంస్థలను, వ్యక్తులను ప్రోత్సహించడం
PM-VBRY ముఖ్య లక్షణాలు
ఉద్యోగులకు ప్రోత్సాహకాలు: EPFO (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్)లో నమోదైన కొత్త ఉద్యోగులు రూ. 15,000 వరకు సాయం చేస్తారు. అంటే కొత్తగా ఉద్యోగంలో చేరే వాళ్లు ఒక నెల జీతం పొందే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం రెండు వాయిదాలలో అందిస్తారు. మొదటి వాయిదాను ఆరు నెలల సర్వీస్ ముగిసిన తర్వాత అందిస్తారు. రెండో వాయిదాను 12 నెలల సర్వీస్ పూర్తి అయ్యి ఆర్థిక అక్షరాస్యత సాధించిన తర్వాత అందిస్తారు. దీని కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వాటిలో పాల్గొనాల్సి ఉంటుంది.
ఈ ప్రోత్సాహకం జీతం రూ. 1 లక్షల లోపు ఉన్న ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఆర్థిక అక్షరాస్యత ప్రోత్సహించేందుకు, ప్రోత్సాహక మొత్తంలో ఒక భాగాన్ని ఒక నిర్దిష్ట కాలం వరకు ఖాతాలో ఉంచి తర్వాత ఉద్యోగి ఉపయోగించుకోవచ్చు.
ఉద్యోగాలు ఇచ్చే వారికి ప్రోత్సాహకాలు: కొత్త ఉద్యోగులను నియమించే కంపెనీలకు నెలకు రూ. 3,000 వరకు సహాయం అందిస్తారు. ఇది మొదటి నాలుగు సంవత్సరాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ప్రోత్సాహకం తయారీ రంగంపై ఎక్కువ దృష్టి సారిస్తుంది. అన్ని రంగాల్లో కొత్త ఉపాధి సృష్టికి ప్రోత్సాహన ఇస్తుంది.
అర్హతలు, నిబంధనలు
ఉద్యోగులకు ఉండాల్సిన అర్హతలు: EPFOలో నమోదైన కొత్త ఉద్యోగులు, జీతం రూ. 1 లక్షల లోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొనడం తప్పనిసరి. అందులో పాల్గొన్న వాళ్లకే రెండో విడత సాయం అందుతుంది.
ఉద్యోగాలు ఇచ్చే చిన్న కంపెనీల కోసం : ఆగస్టు 1, 2025 నుంచి జూలై 31, 2027 మధ్య కొత్త ఉద్యోగులను నియమించే ఎటువంటి సంస్థలు లేదా వ్యక్తులను ఈ ప్రోత్సాహకాలకు అర్హులు.
పథకం ప్రయోజనాలు
ఉద్యోగులకు కలిగే ప్రయోజనం: ఆర్థిక సహాయం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.
ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు కలిగే ప్రయోజనం: కొత్త ఉద్యోగులను నియమించడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించడం, వ్యాపార విస్తరణకు అవకాశం.
సమాజానికి కలిగే ప్రయచ్నం: దేశంలో ఉపాధి స్థాయిలు పెరగడం ద్వారా ఆర్థిక పురోగతి సాధన.కంపెనీలు స్ట్రీమ్‌లైన్ అయిన తర్వాత వాటి ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
అమలు విధానం
ఈ పథకాన్ని కేంద్ర ఉద్యోగ, ఉపాధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. EPFO ఈ పథకంలో కీలక పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఉద్యోగుల నమోదు, ప్రోత్సాహకాల పంపిణీ మొత్తం ఈ శాఖ ద్వారా జరుగుతుంది. ఉద్యోగులు, ఉద్యోగాలు కల్పించే సంస్థలు తమ సమాచారాన్ని EPFO పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలను స్థానికంగా ఉండే శిక్షణా సంస్థల ద్వారా నిర్వహిస్తారు.
PM-VBRYకి ఎలాంటి కంపెనీలకు వర్తిస్తుంది?
ఈ పథంలో చేరాలి అంటే ఇద్దరు కంటే ఎక్కువ 50 మంది కంటే తక్కువ కలిగి ఉన్న కంపెనీలు అర్హత కలిగి ఉంటాయి. మేజర్ సంస్థలు కనీసం ఐదు ఉద్యోగాలు నియమించాలి. అన్ని కొత్త నియామకాలు కనీసం ఆరు నెలల పాటు స్థిరమైన ఉపాధిని కొనసాగించాలి.
డిజిటల్ ఛానెల్‌ల ద్వారా అమలు
ఉద్యోగులకు చెల్లింపులు ఆధార్ కు అనుసంధానమైన ఖాతాల ద్వారా చెల్లిస్తారు. యజమాని ప్రోత్సాహకాలు నేరుగా పాన్-లింక్డ్ ఖాతాల ద్వారా చేస్తారు.