India-Brazil Trade Deal: భారత్, బ్రెజిల్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్.. టెక్నాలజీ, AI సహకారంతో గ్లోబల్ సౌత్‌పై ఫోకస్
భారత్-బ్రెజిల్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత ప్రధాని మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడూ లూలా ఒప్పందంపై చర్చించారు. టెక్నాలజీ, AI సహకారంపై దృష్టి సారించారు.

India-Brazil Trade Deal: భారత్, బ్రెజిల్ దేశాల మధ్య ఒక కొత్త అధ్యాయం మొదలైంది. భారత్- బ్రెజిల్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల అధినేతలు చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వా మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలలో ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. వచ్చే 5 ఏళ్లలో ఇరుదేశాల మధ్య 20 బిలియన్ డాలర్లకు పైగా వాణిజ్యం జరగాలని ఒప్పందం చేసుకున్నారు. ఏఐ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ లో పరస్పర సహకారం ఉండాలని చర్చించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరుదేశాలు కలిసికట్టుగా పోరాటం చేస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
అంతకుముందు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా, ఆయన ప్రతినిధి బృందానికి భారత్‌లో ప్రధాని మోదీ స్వాగతం పలికారు. 'బ్రెజిల్ అధ్యక్షుడు లూలా, ఆయన టీంకు స్వాగతం చెబుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వారి ఫోకస్ అంతా స్ఫూర్తిదాయకమైన నాయకత్వం భారత్- బ్రెజిల్ సంబంధాలలో ప్రయోజనం చేకూరుస్తుంది' అని మోదీ అన్నారు.
గత కొన్నేళ్లలో ఇద్దరు నేతల మధ్య అనేక సమావేశాలు జరిగాయని, ప్రతిసారి అధ్యక్షుడు లూలాకు భారత్ పట్ల తన స్నేహం, నమ్మకం స్పష్టంగా కనిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అధ్యక్షుడు లూలా పర్యటన చారిత్రాత్మక AI ప్రభావ సదస్సును కూడా కొత్త శక్తితో నింపుతుందని, ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. త్వరలో ఇరు దేశాల ప్రభుత్వాలు పూర్తి వివరాలు వెల్లడించనున్నాయి.
#WATCH | Delhi: PM Narendra Modi says, "Brazil is India's largest trading partner in Latin America. We are committed to taking bilateral trade beyond $20 billion in the next five years. Our trade is not just a figure; it's a reflection of trust. The large business delegation… pic.twitter.com/xqUE8Id9j0
— ANI (@ANI) February 21, 2026
20 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వాణిజ్యం
లాటిన్ అమెరికా దేశాలలో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి బ్రెజిల్ అని ప్రధాన మంత్రి మోదీ తెలిపారు. ఇరు దేశాలు వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జరగాలని నిర్ణయం తీసుకున్నాయి. 'ఈ వాణిజ్యం కేవలం ఒక సంఖ్య కాదు. ఇది ఇరుదేశాల మధ్య పరస్పర నమ్మకానికి ప్రతిరూపం లాంటిది. అధ్యక్షుడు లూలాతో వచ్చిన వ్యాపార ప్రతినిధి బృందం సైతం ఇదే నమ్మకంతో ఉందని' మోదీ అన్నారు.
టెక్నాలజీ, గ్లోబల్ సౌత్ పై ఫోకస్
టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో ఇరుదేశాల మధ్య సహకారం కేవలం భారత్, బ్రెజిల్‌లకు మాత్రమే కాకుండా మొత్తం గ్లోబల్ సౌత్‌కు అత్యంత ముఖ్యమైనదని మోదీ అన్నారు. AI, డిజిటల్ టెక్నాలజీ, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో భాగస్వామ్యం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సైతం దిశానిర్దేశం చేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
బ్రెజిల్ రాయబారి కెన్నెత్ హెచ్. డా నోబ్రేగా ఇటీవల అధ్యక్షుడు భారత పర్యటన గురించి మాట్లాడుతూ.. ఔషధాలు, అరుదైన ఖనిజాలు, రెండు దేశాల మధ్య పరస్పర సహకారం వంటి రంగాలలో ఒక ప్రధా అడుగు పడుతుందన్నారు. అమెరికా, చైనా వంటి దీర్ఘకాలిక భాగస్వాములపై ఆధారపడటాన్ని తగ్గించడానికి బ్రెజిల్ ప్రయత్నిస్తోంది. చైనాతో సహా మొత్తం ప్రపంచం అరుదైన ఖనిజాలపై భారత్, బ్రెజిల్ ఏం ప్రకటన చేస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అరుదైన భూమి ఖనిజాల ఒప్పందంతో చైనా ఆధిపత్యానికి చెక్ పెడుతున్నారు.
అరుదైన ఖనిజాల కోసం ప్రపంచం చైనాపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ప్రపంచ అరుదైన భూమి నిల్వలలో చైనా గణనీయమైన భాగాన్ని కలిగి ఉంది. అందుకే చైనా అరుదైన భూమి రంగంలోకి గణనీయమైన చొరబాట్లు చేస్తూనే ఉంది. అదే సమయంలో, బ్రెజిల్ సైతం అరుదైన భూ ఖనిజాలను కలిగి ఉంది. వీటిని శుద్ధి చేసి క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు అవసరమైన లిథియంతో సహా అనేక కీలక ఖనిజాల నిల్వలలో బ్రెజిల్ పటిస్థ స్థితిలో ఉంది.
























