Severe Encounter On Chhattisgarh And Odisha Borders: ఒడిశా - ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. భీకర ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దులోని అటవీ ప్రాంతం రణరంగంలా మారింది. ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకూ 27 మంది మావోయిస్టులు మృతి చెందారని భద్రతా బలగాలు గుర్తించాయి. మరికొంత మందికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటివరకూ 16 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులున్నారని సమాచారం.
ఆపరేషన్ ముమ్మరం
మరోవైపు, ఘటనా స్థలంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ ముమ్మరం చేశాయి. మావోయిస్టులను చుట్టుముట్టిన కోబ్రా సైనికులు లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అటు, ఏకే 47లతో మావోలు పెద్ద ఎత్తున ఎదురుకాల్పులకు తెగబడుతున్నారు.
కాగా, ఒడిశాలోని నువాపాడ జిల్లా సరిహద్దు నుంచి కేవలం 5 కి.మీ దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని కులరిఘాట్ రిజర్వ్ ఫారెస్ట్‌లో జనవరి 19 రాత్రి నుంచి జరిగిన ఎదురు కాల్పుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారని పోలీసులు విడుదల చేసిన లేఖలో తెలిపారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసులు - CRPF సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. కాల్పులు జరిపిన చోట భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. 2024లో ఇక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో 6 మంది మావోయిస్టులు మరణించారు. మరో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. మరో 24 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు.
Also Read: Kolkata Doctor Case : 'ముఖ్యమంత్రి మమత తొందరపాటు చర్యలు అవసరం లేదు' - ఆర్జీకర్ మృతురాలి తండ్రి