100 Websites Blocked:
100 వెబ్‌సైట్‌లు బ్లాక్..
ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న వెబ్‌సైట్స్‌పై (Websites Block) నిఘా పెట్టిన కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 100 వెబ్‌సైట్‌లపై నిషేధం విధించింది. మనీలాండరింగ్‌కి పాల్పడి పెద్ద ఎత్తున డబ్బుని విదేశాలకు తరలించేలా ఈ వెబ్‌సైట్‌లు ప్రోత్సహిస్తున్నాయని తేల్చి చెప్పింది. కేంద్ర హోంమంత్రిత్వ (Home Ministry) శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఐటీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వెబ్‌సైట్‌ల కారణంగా చాలా మంది మోసపోతున్నారని నేషనల్ సైబర్‌క్రైమ్ థ్రెట్ అనాలసిస్ యూనిట్ (NCTAU) వెల్లడించింది. ఈ వెబ్‌సైట్స్‌లో కొన్ని పార్ట్ జాబ్ ఉద్యోగాల పేరిట స్కామ్‌కి పాల్పడుతున్నాయి. ఈ సైట్లన్నింటినీ వెంటనే బ్లాక్ చేయాలని సిఫార్సు చేసింది.
"నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనాలసిస్ గత వారమే కొన్ని సిఫార్సులు చేసింది. 100 వెబ్‌సైట్‌లు పార్ట్ టైమ్ జాబ్‌ల పేరుతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఆ తరవాత మోసం చేస్తున్నాయి. ఐటీ యాక్ట్ 2000 ప్రకారం..కేంద్ర ఐటీ శాఖ కఠిన చర్యలు తీసుకుంది. సైబర్ క్రైమ్ థ్రెట్ అనాలసిస్ సూచనల మేరకు ఈ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసింది"
- కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
పెద్ద ఎత్తున ఫిర్యాదులు..
పెట్టుబడులను ఆకర్షించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ఈ వెబ్‌సైట్‌లను విదేశీ వ్యక్తులే మెయింటేన్ చేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. డిజిటల్ యాడ్స్, ఛాట్ మెసెంజర్‌లు,రెంటెడ్ అకౌంట్‌లతో ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించింది. కార్డ్ నెట్‌వర్క్, క్రిప్టో కరెన్సీ, ఓవర్‌సీస్ ATM విత్‌డ్రాల్స్, ఇంటర్నేషనల్ ఫిన్‌టెక్ కంపెనీల ద్వారా భారత్ నుంచి పెద్ద ఎత్తున డబ్బుల్ని విదేశాలకు తరలిస్తున్ననట్టు హోం శాఖ స్పష్టం చేసింది. National Cybercrime Reporting Portal (NCRP) హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. డేటా సెక్యూరిటీకి ఈ తరహా ఆర్థిక మోసాలు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని హోం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.