బెంగళూరు ప్రజలు బుధవారం భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఇంటికి బయటకు వచ్చిన వారు గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎటు చూసినా ట్రాఫిక్ జామ్... కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలే కనిపించాయి. వాహనం ఒక ఇంచు కదలానన్న చాలా సమయం పట్టింది. దీంతో చాలా మంది గంటల తరబడి రోడ్లపైనే పడిగాపులు కాశారు.
కావేరీ జలాల వివాదంతో మంగళవారం బెంగళూరు బంద్ చేపట్టాయి కన్నడ సంస్థలు, రైతు సంస్థలు. ఆ తర్వాత రోజు బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోయాయి. కొన్ని వాహనాలు రోడ్లపై బ్రేక్‌డౌన్ అవడంతో... ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోయాయి. ముఖ్యంగా... బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం అత్యంత అధ్వాన్నంగా మారింది. ఓఆర్‌ఆర్‌పై దాదాపు ఐదు గంటలకుపైగా వాహనాలు నిలిచిపోవడంతో... వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు.
బుధవారం ఆఫీసుల నుంచి ఇంటికి తిరిగి వెళ్లేవారు.. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. రాత్రి 9గంటల వరకు ఆఫీసుల నుంచి ఎవరూ బయటకు రావొద్దని అధికారులు ప్రకటించారంటే... పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థమవుతుంది. ఓఆర్‌ఆర్, మారతహళ్లి, సర్జాపూర్, సిల్క్‌బోర్డ్ మార్గాలు పూర్తిగా స్తంభించాయి. ఆ మార్గాల్లో చిక్కుకున్న వాహనదారులకు చుక్కలు కనిపించాయి. రెండు గంటలు గచిడినా.. కిలోమీటర్ కూడా కదలేపరిస్థితి లేదంటూ వాహనదారులు గగ్గోలు పెట్టారు. నిన్నటి ట్రాఫిక్ జామ్‌పై చాలా మంది తమ అనుభవాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మూడు గంటలు గడిచినా ఒకటిన్నర కిలోమీటర్ కూడా కదల్లేదంటూ ఒకరు ట్వీట్ చేశారు. ఇంకోకరు... రెండు గంటలు గడిచినా కిలోమీటర్ కూడా ముందుకు కదల్లేకపోయామని వాపోయారు.
ఇక, స్కూల్ పిల్లల పరిస్థితి అయితే మరీ దారుణం. సాయంత్రం 4 గంటల సమయంలో స్కూల్ నుంచి బయటకు వస్తే... ఇంటికి చేరేందుకు రాత్రి 9గంటల సమయం పట్టినట్టు సమాచారం. దీనికి సంబంధించిన స్క్రీన్ చాట్‌లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని స్కూల్ బస్సులు రాత్రి 8గంటలకు పిల్లలను ఇంటి దగ్గర దింపాయి. మరోవైపు... పాదచారులకు చోటు లేకుండా పోయింది. ఫుట్‌పాత్‌లపై కూడా వాహనాలే కనిపించాయి. నడిచివెళ్లేవారు రోడ్డు దాటేందుకు కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. భారత పర్యటనలో ఉన్న హాస్యనటుడు ట్రెవర్ నోహ్... బెంగళూరులో ట్రాఫిక్ జామ్ కారణంగా... తన ప్రదర్శనలను రద్దు చేసుకున్నారు.
రోజుకు ఒకటిన్నర నుంచి 2 లక్షల వరకు ఉండాల్సిన వాహనాల రద్దీ... బుధవారం సాధారణం కంటే రెండింతలు పెరిగిందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. IBI ట్రాఫిక్ నివేదిక ప్రకారం.. బుధవారం రాత్రి 7:30 గంటల వరకు 3.59 లక్షల వాహనాలు తిరిగాయని తేలింది. వర్షం కారణంగా కొన్ని రహదారులపై నీరు నిలిచిపోవడం కూడా ట్రాఫిక్ సమస్యలు కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన ఊరేగింపులు జరుగుతుండం కూడా కారణం కావొచ్చని చెప్తున్నారు.
భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో... ట్రాఫిక్ పోలీసులు కూడా ఏం చేయలేక చేతులెత్తేశారు. బెంగళూరు ట్రాఫిక్‌లో నరకం చూసిన వాహనదారులు మాత్రం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి రావడానికి 5గంటల సమయం పట్టిందని మండిపడుతున్నారు. ట్రాఫిక్‌లో నరకం చూశామని ఆదేవన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.