Haryana Nuh Violence: మణిపూర్ లో రెండు వర్గాల మధ్య చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చడం తెలిసిందే. ఈ విషయంపై గత కొన్నిరోజులుగా పార్లమెంట్ ఉభయ సభలలో అధికార, విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. తాజాగా హర్యానాలో మరో గొడవ చెలరేగడం కలకలం రేపుతోంది. హర్యానాలోని నుహ్‌ ప్రాంతంలో ఒక మతానికి సంబంధించిన ఊరేగింపుపై  రాళ్లు రువ్వడంతో పాటు కార్లకు నిప్పంటించడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణ మరింత తీవ్రం కాకుండా, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఘర్షణ పరిస్థితుల కారణంగా నుహ్ ఏరియాలో మొబైల్ ఇంటర్నెట్ తో పాటు మెస్సేజ్ సేవల్ని ఆగస్టు 2 వరకు నిలిపివేశారు. 144 సెక్షన్ విధించి, జనాలు గుంపులు గుంపులు లేకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 






అసలేం జరిగిందంటే..
విశ్వ హిందూ పరిషత్ కు చెందిన బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర జరుగుతుండగా నూహ్‌లోని ఖేడ్లా మోడ్ సమీపంలో కొంతమంది యువకులు అడ్డుకున్నారు. ఊరేగింపును అడ్డుకోవడంతో పాటు యాత్ర నిర్వహిస్తున్న వారిపై రాళ్లు విసరడంతో వివాదం మొదలై ఘర్షణకు దారితీసింది. తమను అడ్డుకున్న యువకులపై ఊరేగింపులో ఉన్న వ్యక్తులు సైతం రాళ్లు వేశారు. రెండు వర్గాల మధ్య రాళ్లదాడిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాష్పవాయువు ప్రయోగించి రెండు వర్గాలను చెదరగొట్టారని పీటీఐ పేర్కొంది.


ఊరేగింపులో ఉన్న నాలుగు కార్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పోలీసు వాహనాలపై సైతం రాళ్లదాడి జరగడంతో వాహనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఘర్షణ చోటుచేసుకోవడం కారణంగా చిన్నారులు సహా దాదాపు 2,500 మంది పురుషులు, మహిళలు నుల్హర్ లోని శివుడి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారని జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. పరిస్థితిని అదుపులోకి తేవడంలో భాగంగా ప్రభుత్వం హర్యానాలోని నుహ్ లో ఇంటర్నెట్ సేవల్ని ప్రభుత్వం బుధవారం వరకు రద్దు చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదని అక్కడ 144 సెక్షన్ విధించారు.






ఇరువర్గాలు రాళ్లదాడి చేసుకున్న నుహ్ ఏరియాలో బలగాలను మోహరించినట్లు హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి విషయం తెలిపి సహాయం కోరగా.. భద్రతా సిబ్బందిని పంపుతామని చెప్పినట్లు తెలిపారు. ఈ గొడవపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరగకుండా ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు.