Gujarat Dayro Event Singer Showered With Currency Notes: గుజరాతీ సంప్రదాయ సంగీత కచేరీ డైరో అంటేనే నోట్ల వర్షానికి పెట్టింది పేరు. తాజాగా దేవభూమి ద్వారక జిల్లాలోని ఖంభాలియాలో జరిగిన శ్రీమద్ భాగవత్ సప్తహ వేడుకల్లో ఈ సంప్రదాయం మరోసారి వైరల్‌గా మారింది. ప్రసిద్ధ జానపద గాయకుడు తన గాత్రంతో భక్తులను మైమరిపిస్తుండగా, వేదికపై ఉన్న వారు , ప్రేక్షకులు ఒక్కసారిగా కరెన్సీ నోట్లను గాలిలోకి విసిరారు. చూస్తుండగానే గాయకుడు నోట్ల కుప్ప కింద దాదాపుగా కూరుకుపోయారు. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు ఇది నోట్ల వర్షం కాదు, అక్షరాలా నోట్ల ప్రవాహం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక ప్రయోజనం కోసమే ఈ విరాళాలు
కేవలం ఆడంబరం కోసమే ఇలా నోట్లు చల్లుతున్నారని అనుకుంటే పొరపాటే. ఈ ఈవెంట్ వెనుక ఒక గొప్ప సామాజిక లక్ష్యం ఉంది. ఈ కార్యక్రమంలో సేకరించిన ప్రతి పైసాను ఒక మంచి కార్యం కోసం వినియోగించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. వేదికపై కురిసిన నోట్లను , వచ్చిన విరాళాలను లెక్కించిన తర్వాత, ఈవెంట్ ఖర్చులను మినహాయించి మిగిలిన మొత్తం సొమ్మును అహిర్ ఛారిటబుల్ ట్రస్ట్ కు అందజేయనున్నారు.
బాలికల హాస్టల్ నిర్మాణం
ఈ నిధులతో అహ్మదాబాద్‌లో బాలికల హాస్టల్, ఒక భారీ విద్యా భవనాన్ని నిర్మించనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అహిర్ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థినులకు ఉన్నత విద్య కోసం వసతి కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. భక్తితో పాటు విద్యా దానానికి కూడా తోడ్పడాలనే ఉద్దేశంతోనే ప్రజలు ఇంత భారీ ఎత్తున నోట్లను చల్లారని నిర్వాహకులు వెల్లడించారు.
గుజరాతీ సంస్కృతిలో భాగం
గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఇలాంటి డైరో కార్యక్రమాల్లో డబ్బులు చల్లడం అనేది ఒక పాత సంప్రదాయం. దీనిని అక్కడ ఘోల్ అని పిలుస్తారు. ఇలా సేకరించిన సొమ్మును సాధారణంగా గోశాలల నిర్వహణకు, పేద పిల్లల చదువులకు , సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. గతంలో కూడా బ్రిటీష్ గాయకుడు హెమ్ మంతన్ పటేల్ వంటి వారి కార్యక్రమాల్లో ఇలాగే కోట్ల రూపాయల నోట్లు చల్లిన సందర్భాలు ఉన్నాయి.
