Go First Airlines: 


సర్వీస్‌లకు అంతరాయం..


ఈ ఏడాది మే నెల నుంచి Go First Airlines సర్వీస్‌లకు అంతరాయం ఏర్పడింది. పూర్తి స్థాయిలో సర్వీస్‌లను రద్దు చేసింది సంస్థ. అప్పటి నుంచి ఒక్క విమానం కూడా గాల్లోకి ఎగరలేదు. ఇప్పుడు ఆగస్టు 31వ తేదీ వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది. ట్విటర్ వేదికగా ఈ ప్రకటన చేసింది. కొన్ని కారణాల వల్ల ఫ్లైట్ సర్వీస్‌లను నిలిపివేస్తున్నామని, అంతరాయానికి చింతిస్తున్నామని వెల్లడించింది. వీలైనంత త్వరగా సర్వీస్‌లను ప్రారంభించేందుకు ఇప్పటికే చర్యలు మొదలు పెట్టామని ట్విటర్‌లో పోస్ట్ పెట్టింది. త్వరలోనే బుకింగ్స్ మొదలవుతాయని తెలిపింది. 


"కొన్ని కారణాల వల్ల ఆగస్టు 31వ తేదీ వరకూ Go First విమాన సర్వీస్‌లను రద్దు చేస్తున్నాం. ఈ అంతరాయానికి చింతిస్తున్నాం. ఏమైనా క్వైరీస్ ఉంటే ప్రయాణికులు ఎలాంటి సంకోచం లేకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని ఇప్పటికే అప్లికేషన్ పెట్టాం. త్వరలోనే సర్వీస్‌లను ప్రారంభిస్తాం. బుకింగ్స్ మొదలవుతాయి. బహుశా మేం సర్వీస్‌లను క్యాన్సిల్ చేయడం వల్ల మీ ట్రావెలింగ్ ప్లాన్స్‌కి అసౌకర్యం కలిగి ఉండొచ్చు. మా తరపున మేం ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం"


- గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ 






కారణమిదీ..


ఈ ఏడాది మే 2వ తేదీన ఈ సంస్థ అన్ని విమాన సర్వీస్‌లనూ రద్దు చేసింది. అమెరికాకి చెందిన ఓ కంపెనీ ఈ ఫ్లైట్స్‌కి ఇంజిన్స్ తయారు చేస్తోంది. అయితే...వీటిలో కొన్ని లోపాలున్నాయని, వాటిని పరిష్కరించేంత వరకూ ఫ్లైట్స్‌ నడపలేమని సంస్థ ప్రకటించింది. దీనిపై Directorate General of Civil Aviation (DGCA) జోక్యం చేసుకుంది. సర్వీస్‌లను ప్రారంభించుకునేందుకు కొన్ని షరతులతో కూడిన అనుమతినిచ్చింది.  15 ఎయిర్‌క్రాఫ్ట్‌లు నడుపుకోవచ్చని చెప్పింది. ఈ కంపెనీలో మొత్తం 4,200 మంది ఉద్యోగులున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.4,183 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే...గ్రౌండింగ్ విషయంలో సమస్యలు తలెత్తడం వల్ల పూర్తిగా వీటిని పక్కన పెట్టేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. వాడియా గ్రూప్‌నకు (Wadia Group) చెందిన గోఫస్ట్‌ ఎయిర్‌లైన్స్ అతి పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దివాలా పరిష్కార ప్రక్రియ కోసం (bankruptcy) జాతీయ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (NCLT) దిల్లీ బెంచ్‌కి స్వచ్ఛందంగా దరఖాస్తు చేస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఎటువంటి నోటీసు లేకుండా విమానాలను రద్దు చేసి, ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేసింనందుకు ఈ కంపెనీకి DGCA షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. గోఫస్ట్‌‌, తన రుణదాతలకు భారీగా బకాయిలు పడింది. దివాలా ప్రక్రియ కోసం దాఖలు చేసిన పత్రాల ప్రకారం, ఆర్థిక రుణదాతలకు ఇప్పటికిప్పుడు ₹6,521 కోట్లు (798 మిలియన్‌ డాలర్లు) చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఈ బకాయిల్లో దేనినీ ఏప్రిల్ 30 వరకు డిఫాల్ట్ చేయలేదని తన ఫైలింగ్‌లో ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది.