Gig Workers Shutdown Strike: దేశవ్యాప్తంగా లక్షల మంది డెలివరీ భాగస్వాములు, రైడ్-హెయిలింగ్ డ్రైవర్లు, ఇతర యాప్ ఆధారిత కార్మికులను ఏకం చేయడానికి గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) సమ్మెబాట పడుతోంది. నేడు(జనవరి 26, 2026) దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ సమ్మెకు యూనియన్ పిలుపునిచ్చింది, దీనిలో కార్మికులు నిరసనగా తమ యాప్‌లను మూసివేస్తారు. దీని తర్వాత ఫిబ్రవరి 3న వివిధ నగరాల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు.  

ఈ ఉద్యమానికి మహిళా గిగ్ వర్కర్లు నాయకత్వం వహిస్తారు.

ముఖ్యంగా, ఈ ఉద్యమానికి మహిళా గిగ్ వర్కర్లు నాయకత్వం వహిస్తారు. ప్లాట్‌ఫామ్ ఆర్థిక వ్యవస్థలో మహిళలు ఎక్కువగా దోపిడీని ఎదుర్కొంటున్నారని యూనియన్ జాతీయ అధ్యక్షురాలు సీమా సింగ్ పేర్కొన్నారు. చాలా మంది మహిళా కార్మికులు తమ సేవలకు తక్కువ జీతం పొందుతున్నారు, శారీరక హింసను ఎదుర్కొంటున్నారు. వారు కంపెనీకి ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకున్న వారు లేరని ఆరోపిస్తున్నారు. చివరికి, వారి IDలు బ్లాక్ అవుతున్నాయని ఉద్యోగాల నుంచి తీసివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి, కానీ ప్రభుత్వం మౌనంగా ఉందని ఆందోళన చెందుతున్నారు. 

జొమాటో ప్రతి నెలా వేలాది మంది కార్మికులను తొలగిస్తోంది

జొమాటో వంటి సంస్థలు ప్రతి నెలా 5,000 మందికిపైగా కార్మికులను తొలగిస్తున్నాయని యూనియన్ ఆరోపిస్తోంది. అర్బన్ కంపెనీ కార్మికులు దీనికి ఒక ప్రధాన ఉదాహరణ. వారంతా మీడియా ముందుకు రావాలని అనుకుంటున్నారు కానీ  భయంతో తమ ముఖాలను దాచుకుంటారు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదా? కార్మికులు బలవంతంగా పని చేయిస్తున్నారు, అయినప్పటికీ వారి గొంతులను అణచివేస్తున్నారు.

సీమా సింగ్ మాట్లాడుతూ, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు అనేక మెమోరాండమ్‌లను యూనియన్ సమర్పించిందని, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని అన్నారు. ఇటీవల, మంత్రి మన్సుఖ్ మాండవీయ 10 నిమిషాల తక్షణ డెలివరీని ఆపివేయడం గురించి కూడా స్పందించారు. దీనిపై ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు లేదా నోటిఫికేషన్ జారీ కాలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం కేవలం మాటలే చెబుతుందని ఆరోపించారు. కానీ గిగ్ కార్మికుల నిజమైన సమస్యలైన ID బ్లాకింగ్, భద్రత, కార్మికుల దుస్థితిపై మౌనంగా ఉందన్నారు. 

కార్మికుల ప్రధాన ఫిర్యాదులు ఏమిటి?

  • ఏకపక్షంగా ID బ్లాకింగ్, అన్యాయమైన రేటింగ్ వ్యవస్థ
  • ఆదాయంలో నిరంతర తగ్గుదల, కమీషన్ల పెరుగుదల, పారదర్శకత లేకపోవడం
  • కస్టమర్ ఫిర్యాదులను వివరించడానికి కార్మికులకు అవకాశం ఇవ్వకపోవడం.
  • డబుల్ క్యాన్సిలేషన్ పెనాల్టీ, టైమ్ క్యాప్, బండిల్డ్ బుకింగ్, ఆటో-అసైన్ వంటి వ్యవస్థలు
  • మహిళలకు భద్రత లేకపోవడం, పీరియడ్స్‌లో సెలవుల డిమాండ్, 'రెడ్ బటన్' అత్యవసరం 
  • కొత్త విధానాలు లేదా మార్పులను అమలు చేయడానికి ముందు కార్మికులను సంప్రదించకపోవడం

యూనియన్ ప్రధాన డిమాండ్లు

  • గిగ్ అండ్‌ ప్లాట్‌ఫామ్ కార్మికులకు విడివిడిగా బలమైన కేంద్ర చట్టం తీసుకురావాలి.
  • ఏకపక్ష ID బ్లాకింగ్ , అనుచిత రేటింగ్‌లను వెంటనే ఆపండి
  • ఆదాయ రేట్ల పెరుగుదల, కమిషన్ కోతలను అరికట్టడం
  • పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నివారించడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీలు.
  • పారదర్శక ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం, కార్మిక అనుకూల విధానాలు

GIPSWU అన్ని గిగ్ కార్మికులకు విజ్ఞప్తి చేస్తుంది

జొమాటో, స్విగ్గీ, అర్బన్ కంపెనీ, ఓలా, ఉబర్ లేదా మరే ఇతర ప్లాట్‌ఫామ్‌లో పనిచేస్తున్నా, గిగ్ కార్మికులందరూ జనవరి 26న తమ యాప్‌లను మూసివేసి ఫిబ్రవరి 3న రోడ్లపైకి రావాలని GIPSWU విజ్ఞప్తి చేసింది. వారు ఎంపీలు, ఇతర ట్రేడ్ యూనియన్లు, మహిళా సంస్థలు, సాధారణ ప్రజల నుంచి కూడా మద్దతు కోరారు. ఇది మా పోరాటం మాత్రమే కాదు; ఇది మొత్తం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అంతటా కార్మికుల గౌరవం, భద్రత కోసం పోరాటం. మా డిమాండ్లు నెరవేరకపోతే, పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతాయని హెచ్చరించారు.