G20 Summit 2023: జీ-20 సదస్సును భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సమావేశాలకు వచ్చే ప్రముఖులకు అతిథి మర్యాదలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  ప్రపంచ దేశాధినేతలకు చక్కటి ఆతిథ్యం ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. వారి కోసం దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ హోటళ్లను ఇప్పటికే బుక్‌ చేశారు. సదస్సుకు వచ్చే ప్రతినిధులకు వారికి భారత వంటలను రుచి చూపించేందుకు, భారత ఆతిథ్యాన్ని పరిచయం చేసేలా హోటళ్ల నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. 


అతిథులకు స్వాగతం పలకడం దగ్గర నుంచి వారికి బస, వంటకాల ఏర్పాట్లపై హోటల్లు ప్రత్యేక దృష్టి పెట్టాయి. అతిథులను మెప్పించేందుకు హోటళ్లను రంగుల పూలతో అందంగా అలంకరిస్తున్నాయి. వారికి ఏమాత్రం లోటు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అతిథులకు విదేశీ వంటకాలతో పాటు భారత రుచులను పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజ్‌ హోటల్‌ నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ దేశాధినేతలు బస చేసే గదులను పోలీసులు, భద్రతా సిబ్బంది ఇప్పటికే తనిఖీ చేశారని చెప్పారు. 


జీ-20 అతిథులకు అంతర్జాతీయ వంటకాలతో సహా 250కి పైగా రుచికరమైన వంటకాలను అందించాలని లలిత్‌ హోటల్‌ ప్రణాళిక చేస్తోంది. తృణధాన్యాల ఆధారిత వంటకాలను కూడా తయారు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బై డెన్ ,  బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ సహా 24  దేశాధినేతలు సమావేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో ఆతిథ్యానికి ఎటువంటి వంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అతిథులు బస చేస్తున్న హోటళ్ల వద్ద కఠిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  


అమెరికా అధ్యక్షుడు జోబైడన్‌కు ఐటీసీ మౌర్యలో బస ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా దేశాల ఇంటలిజెన్స్ సంస్థల అధికారులు ఢిల్లీకి చేరుకొని తమ అధినేతల  రాకపోకల ఏర్పాటు చేసుకుంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ జి 20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావడం లేదు. ఈ రెండు దేశాల అధ్యక్షులు హాజరు కాకపోవడం వెనుక కారణాలపై  రకరకాల చర్చలు జరుగుతున్నాయి.  జీ-20 సదస్సుకు సంబంధించిన ఢిల్లీలోని కీలకమైన వేదికలు, ఇతర ప్రాంతాల వద్ద సన్నద్ధతను ఆదివారం కొందరు ప్రభుత్వ ప్రతినిధులు పరిశీలించారు. ఆ బృందంలో ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాతో పాటు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్ర ఉన్నారు. 


సర్వాంగ సుందరంగా ఢిల్లీ 
జీ 20 సదస్సుకు ఢిల్లీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రోడ్లకు ఇరువైపులా ల్యాండ్ స్కేపింగ్ చేసి చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జి20 సదస్సు జరిగే భారత మండపం వరకు పరిసరాలన్నిటిని అలంకరించారు. రోడ్లకు ఇరువైపులా జీ 20 దేశాల జెండాలు నిలబెట్టారు. భారతదేశ కళావైభవ చిహ్నాలు అన్నిటిని రోడ్ల ముఖ్య కూడలిలో అందంగా అమర్చారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కళారూపాల ఫ్లెక్సీలను విమానాశ్రయం వద్ద ప్రదర్శనగా పెట్టారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈ డెకరేషన్స్  చేశారు. 


ఆ మూడు రోజులు ఢిల్లీ లాక్ డౌన్ ?
సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో ఢిల్లీ అనధికారిక లాక్ డౌన్ లోకి వెళ్లబోతోంది. ఢిల్లీకి వచ్చే దాదాపు 100కు పైగా రైళ్లను ఈ మూడు రోజుల్లో రద్దు చేశారు. అలాగే విమాన రాకపోకలు సైతం రద్దు చేశారు. సెంట్రల్ ఢిల్లీని పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మార్చేశారు. కేవలం సెంట్రల్ ఢిల్లీలో నివసించేవారు మినహా మిగిలిన వారెవరిని సెంట్రల్ ఢిల్లీలోకి అనుమతించడం లేదు. దేశాధినేతల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకే ఈ మూడు రోజులపాటు ఆంక్షలు విధించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.