భారతదేశంలో, ఏప్రిల్ 2026 నుండి అశ్వగంధ ఆకులను ఏ రూపంలోనూ ఆహార పదార్థాలలో ఉపయోగించడం చట్టవిరుద్ధం. FSSAI కేవలం అశ్వగంధ వేర్లు మరియు వాటి రసాన్ని మాత్రమే అనుమతించింది.
Ashwagandha Leaves Banned: అశ్వగంధ ఆకులపై నిషేధం! ఆహార ఉత్పత్తుల్లో వాడొద్దని FSSAI ఆదేశం!
Ashwagandha Leaves Banned: భారత్ ఆహార భద్రత అండ్ FSSAI అశ్వగంధ ఆకులపై నిషేధం విధించింది. ఆహార ఉత్పత్తుల్లో వాడొద్దని చెప్పింది.

- అశ్వగంధ ఆకులను ఆహారంలో వాడకాన్ని FSSAI నిషేధించింది.
- కేవలం అశ్వగంధ వేర్లు, వాటి రసం మాత్రమే అనుమతి.
- ఆకులతో తయారు చేసిన ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని ఆదేశం.
- విదేశాల్లో ఈ ఆంక్షలు ఇప్పటికే అమలులో ఉన్నాయి.
Ashwagandha Leaves Banned: భారత్‌లో అశ్వగంధ అనేది శతాబ్ధాలుగా వాడుకలో ఉన్న ఒక శక్తివంతమైన మూలిక. దీనిని మూలికల రాజుగా పిలుస్తారు. అయితే ఇటీవల కాలంలో దీని వినియోగం విషయంలో కొన్ని ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి రావడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2026లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ముఖ్యమైన అడ్వైజరీని జారీ చేసింది. దీని ప్రకారం అశ్వగంధ ఆకులను ఏ రూపంలోనైనా ఆహార పదార్థాల్లో వాడకం చట్టవిరుద్ధమని ప్రకటించింది.
ఆకులను కాదు వేర్ల రసాన్నే వాడాలి!
FSSAIజారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం, అశ్వగంధ మొక్కల్లోని అన్ని భాగాలు ఆహారానికి పనికిరావు. కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన రసాన్ని మాత్రమే హెల్త్ సప్లిమెంట్స్, న్యూట్రాస్యూటికల్స్, ఫంక్షనల్ ఫుడ్స్‌లో వాడటానికి అనుమతి ఇచ్చింది.
మార్కెట్‌లో ఉన్న సరకు వెనక్కి తీసుకోవాలని ఆదేశం
ఈ నిషేధం కేవలం ఆహార తయారీదారులకే కాకుండా, దిగుమతిదారులు, విక్రేతలకు కూడా వర్తిస్తుంది. ఆకులను వాడటం వల్ల కలిగే భద్రతాపరమైన సమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం స్ఫష్టం చేసింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఉత్పత్‌తుల్లో ఆకులు ఉంటే వాటిని వెనక్కి తీసుకోవాలని, లేదా జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఈ అడ్వైజరీ ఏప్రిల్ 16 నుంచి అమలులోకి వచ్చింది. ఇది కేవలం సూచన మాత్రమే కాదు. దీనిని ఉల్లంఘిస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎందుకు నిషేధం విధించాల్సి వచ్చింది?
అశ్వగంధ ఆకులను నిషేధించడానికి ప్రధాన మూడు కారణాలు ఉన్నాయ. అశ్వగంధ ఆకుల్లో విథాపెరిన్-A అనే కాంపౌండ్ వేర్ల కంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కొన్ని పరిమితులను మించి తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది.
దుష్ప్రభావాలపై అధ్యయనం
ఇటీవలి కాలంలో అశ్వగంధ వాడకం వల్ల కాలేయం దెబ్బ తిన్న కేసులు నమోదు అయ్యాయి. ఐస్లాండ్, జర్మనీ, భారత్‌లోని కొన్ని ఆసుపత్రుల్లో నిర్వహించిన అధ్యయనాల్లో అశ్వగంధ సప్లిమెంట్స్ తీసుకున్న వారిలో డ్రగ్ ఇండ్యూస్ట్ లీవర్ ఇంజూరీ లక్షణాలు కనిపించాయి. ముఖ్యంగా ఆకులతో కూడిన మిశ్రమాలు కాలేయంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఆయుర్వేదం, సిద్ధ, యునానీ వంటి పురాతన వైద్య గ్రంథాల్లో అశ్వగంధ వేర్ల వాడకాన్ని మాత్రమే అంతర్గత వినియోగానికి సూచించారు. ఆకులను కేవలం బయటి పూతగా మాత్రమే వాడాలని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి.
ఎరువుగా వాడాల్సిన ఆకులు మందుల్లో..
అశ్వ గంధం వేర్ల కంటే ఆకులు సుమారు 100 రెట్లు తక్కువ ధరకు లభిస్తాయి. తయారీదారులు తమ లాభాలను పెంచుకోవడానికి, వేర్లకు బదులుగా తక్కువ ధరకు వచ్చే ఆకులను మిశ్రమం చేయడం ప్రారంభించారు. దీని వల్ల వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తి అందకపోవడమే కాకుండా, ఆరోగ్య ముప్పు కూడా పెరుగుతోంది. నిజానికి రైతులు ఆకులను భూమికి ఎరువుగా వాడాల్సి ఉండగా, కొన్ని కంపెనీలు వాటిని సేకరించి మందుల తయారీలో వాడుతున్నారు.
విదేశాల్లో ఎప్పటి నుంచో నిషేధం
భారత్ కంటే ముందే చాలా ఐరోపా దేశాలు అశ్వగంధపై ఆంక్షలు విధించాయి. డెన్మార్క్ ఇప్పటికే ఆహార సప్లిమెంట్‌లో వాడకూడదని స్పష్టం చేసింది. పోలాండ్, హంగేరీ, నెదర్లాండ్స్ వంటి దేశాలు కూడా ఆకు వాడకాన్ని అనుమతించడం లేదు. గర్భధారణ సమయంలో అశ్వగంధ వాడకం వల్ల గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని అనుమానాలు కూడా ఉన్నాయి. దీనిపై భారతీయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కొనే ముందు ఇవి పరిశీలించాలి
మీరు అశ్వగంధ సప్లిమెంట్స్ వాడుతున్నట్టైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కొనే డబ్బాపై అశ్వగంధ రూట్ ఎక్స్‌ట్రాక్ట్ లేదా అశ్వగంధ వేరు సారం అని స్పష్టంగా ఉందో లేదో చూడండి. కేవలం అశ్వగంధ ఎక్స్రాక్ట్ అని ఉంటే అందులో ఆకులు ఉండే అవకాశం ఉంది. కేవలం వేర్లను మాత్రమే వాడే సర్టిఫైడ్ బ్రాండ్‌లను మాత్రమే ఎంచుకోండి. మీకు కాలేయం సంబంధిత సమస్యలు ఉంటే అశ్వగంధ వాడకానికి ముందు వైద్యుల సలహా తీసుకోండి.
Frequently Asked Questions
భారతదేశంలో అశ్వగంధ ఆకుల వాడకంపై కొత్త నియమాలు ఏమిటి?
అశ్వగంధ ఆకుల వాడకాన్ని ఎందుకు నిషేధించారు?
అశ్వగంధ ఆకులలో 'విథాపెరిన్-A' అనే కాంపౌండ్ అధికంగా ఉంటుంది, ఇది కొన్ని పరిమితులకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. ఇటీవల కాలంలో అశ్వగంధ ఆకుల వాడకం వల్ల కాలేయం దెబ్బతిన్న కేసులు నమోదయ్యాయి.
అశ్వగంధ ఉత్పత్తులు కొనేటప్పుడు వినియోగదారులు ఏమి గమనించాలి?
కొనే డబ్బాపై 'అశ్వగంధ రూట్ ఎక్స్రాక్ట్' లేదా 'అశ్వగంధ వేరు సారం' అని స్పష్టంగా ఉందో లేదో చూడండి. కేవలం 'అశ్వగంధ ఎక్స్రాక్ట్' అని ఉంటే ఆకులు ఉండే అవకాశం ఉంది. కేవలం వేర్లను మాత్రమే వాడే సర్టిఫైడ్ బ్రాండ్లను ఎంచుకోండి.
అశ్వగంధ ఆకులను ఆహారంలో కలపడానికి గల కారణాలు ఏమిటి?
తయారీదారులు లాభాల కోసం, వేర్లకు బదులుగా తక్కువ ధరకు లభించే ఆకులను మిశ్రమం చేస్తున్నారు. దీనివల్ల నాణ్యత తగ్గడమే కాకుండా, ఆరోగ్యానికి ముప్పు కూడా పెరుగుతోంది.
ట్రెండింగ్ వార్తలు


















