మత సామరస్యానికి ప్రతీకలాంటి మన దేశంలో గత కొద్ది రోజులగా మత ఘర్షణలు జరుగుతున్నాయి. ఆ వర్గం వీరిపై దాడి చేసిందని ఈ వర్గం వారిపై దాడి చేసిందనే వార్తలే ఎటు చూసినా వినిపిస్తున్నాయి. కానీ 130 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి, లౌకికవాదానికి, మతసామరస్యానికి ప్రతీకల్లా నిలిచే ఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మీ కోసం.
1 వలియంగాడీ జుమ్మా మసీద్, మలప్పురం, కేరళ
కేరళలోని మలప్పురంలో ఉంది వలియంగాడీ జుమ్మా మసీదు. అక్కడ 18వ శతాబ్దం నుంచి ఓ హిందువు వీరమరణాన్ని గుర్తు చేసుకుంటూ మసీదులో ప్రార్థనలు చేస్తున్నారు. ఆయనపేరు కున్ హేలు. ఆ ప్రాంతంలో ఆయనంటే చాలా గౌరవం. 290 సంవత్సరాల ముందు కోజికోడ్ పాలకులు మలబార్‌పై యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో 43 మంది ముస్లింలతో కలిసి పాల్గొన్న కున్ హేలు వీరమరణం పొందారు. ఆయన త్యాగాన్ని నేటికి గుర్తు చేసుకుంటూ వలియంగాడీ జుమ్మా మసీద్‌లో నేటికీ ప్రార్థనలు జరపటం హిందూ-ముస్లిం ఐక్యతకు, పరస్పర గౌరవభావానికి ఓ ఉదాహరణ.
2.నాథోవల్ గ్రామం, లూథియానా
లూథియానా సమీపంలో ఉండే నాథోవల్ గ్రామం మత సామరస్యానికి ప్రతీక. ఈ ఊళ్లో ఓ పాత మసీదు ఉండేది. అది కూలిపోయే దశకు వచ్చినప్పుడు దాన్ని బాగు చేసుకోవటానికి రూ. 25 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు గ్రామంలోని హిందువులు, సిక్కులు కలిసి రూ.15 లక్షలు విరాళాలను పోగు చేసి మసీదుకు ఇచ్చారు. అంతే కాదు ఈ ఊర్లో దీపావళి, దసరా, రాఖీ లాంటి పండుగలను అన్ని మతాల వాళ్లు కలిసి మెలిసి చేసుకుంటారు. ఇదీ యూనిటీ అంటే.
3.అబిద్ అల్వీ, ఉత్తర్‌ప్రదేశ్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని జానాపూర్‌లో అబిద్ అల్వీ అనే ముస్లిం కుర్రాడు హనుమాన్ చాలీసాను ఉర్దూలోకి అనువదించాడు. ఊళ్లో ఉన్న అన్ని మతాలు ఇతర మతాల అభిప్రాయాలను, ధర్మాన్ని అర్థం చేసుకోవాలని ఆ కుర్రాడు ఈ ప్రయత్నం చేశాడు. మూడు నెలల్లో ఈ సంకల్పాన్ని పూర్తి చేసిన అబిద్ అల్వీ మరిన్ని హిందీ ధర్మగ్రంథాలు ఉర్దూలోకి ట్రాన్ లేట్ చేయాలనే సంకల్పంతో కృషి చేస్తున్నాడు.
4.రాజీవ్ శర్మ, రాజస్థాన్
రాజస్థాన్‌కు చెందిన రాజీవ్ శర్మ అనే హిందూ... మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని, ఆయన బోధనలను రాజస్థాన్‌కు చెందిన మర్వారీ భాషలోకి అనువదించారు. 112 పేజీలుండే ఈ పుస్తకానికి 'పైగాంబర్‌రో పైగామ్' అని పేరు పెట్టాడు. అక్కడి లైబ్రరీలో ఈ పుస్తకాన్ని ఫ్రీగా అందుబాటులో పెట్టారు. ఇవే కాకుండా మరో 300 పుస్తకాలు ఆయన ఈ లైబ్రరీలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. సర్వమతాల సారమే మనిషి జీవితం అనే తత్వంతో ఆయన ఈ రచనలు చేశారు.
5.షేక్ రియాజుద్దీన్ అబ్దుల్ ఘనీ, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతానికి చెందిన షేక్ రియాజుద్దీన్ అబ్దుల్ ఘనీని స్థానికంగా రాజూబాబా కీర్తన్ కార్ అని పిలుస్తారు. ఎందుకంటే తలపైన నీటి కుండతో మీరాబాయి భజనలు చేస్తుంటారు ఈయన. చిన్నతనం నుంచి కీర్తనలపై ఆకర్షితుడై నేర్చుకున్నానని చెప్పే అబ్దుల్ ఘనీ ఆలయాల్లో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు.
Also Read: Russia Ukraine War: పుతిన్‌కు మరో షాక్- జపాన్, స్విట్జర్లాండ్ కీలక నిర్ణయం