Encounter Break Out Between Naxalites And Security Personnels In Chattisgarh: సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్ గఢ్ (Chattisgarh)లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నారాయణపూర్ (Narayanpur) - కాంకేర్ (Concare) జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మంగళవారం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో మొత్తం 9 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, 15 రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరగడం ఇది రెండోసారి. మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని తెక్ మేట, కాకూర్ గ్రామం మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీగా ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్ జీ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. సోమవారం రాత్రి నుంచి పటిష్టంగా గాలింపు చేపట్టి.. మంగళవారం ఉదయం వారు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో మావోలు వీరిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 9 మంది మావోలు మృతి చెందారు. మరికొందరు నక్సల్స్ పరారయ్యారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.


ఆయుధాలు స్వాధీనం


కాగా, ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బంది ఎలాంటి గాయాలు కాలేదని బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్ రాజ్ వెల్లడించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలతో సహా ఓ ఏకే 47 కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే, మృతి చెందిన మావోయిస్టుల వివరాలు ఇంకా గుర్తించలేదని.. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. 


ఇటీవలే కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అప్పుడు జరిగిన కాల్పుల్లో 29 మంది మరణించారు. వీరిలో ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీకి చెందిన అగ్ర నాయకులు ఉన్నారు. ప్రస్తుతం జరిగిన ఎన్ కౌంటర్ తో కలిపి ఇప్పటివరకూ బస్తర్ అడవుల్లో దాదాపు 90 మంది నక్సల్స్ ను భద్రతా సిబ్బంది హతమార్చారు.


Also Read: Patanjali: 'అధికారులు ఇప్పటికి నిద్ర లేచారు' - పతంజలి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం