కోల్‌కతా: కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూశారు. టీఎంసీ సీనియర్ నేత సోమవారం కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు కాగా, చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 1:30 గంటలకు ఆయన చనిపోయినట్లు సమాచారం. ముకుల్ రాయ్ మృతిపట్ల టీఎంసీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Continues below advertisement

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి నమ్మకమైన నేతగా ముకుల్ రాయ్ ఎదిగారు. కేంద్రంలో కీలక పదవులు చేపట్టి సేవలు అందించారు. ముకుల్ రాయ్ 2009లో కేంద్ర షిప్పింగ్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2011, 2012 మధ్య రైల్వే శాఖ మంత్రిగా సేవలు అందించారు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన సమయంలో పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. 

ముకుల్ రాయ్ పొలిటికల్ కెరీర్..

ఒకప్పుడు ముకుల్ రాయ్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో రెండవ అత్యంత ప్రభావవంతమైన నేతగా ఉన్నారు. నైపుణ్యం కలిగిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ఆయనకు పేరుంది. 2011 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించారు. 2017లో పార్టీతో సంబంధాలు చెడటం, నారద స్టింగ్ వివాదం సమయంలో టీఎంసీ నుంచి ఆయనను బహిష్కరించారు. నారద స్టింగ్ ఆపరేషన్ దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం రేపింది.

Continues below advertisement

బీజేపీలో చేరి, తిరిగి టీఎంసీకి యూటర్న్.. 

నవంబర్ 2017లో ముకుల్ రాయ్ భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. పార్టీలో ఆయన హోదా వేగంగా పెరిగింది. 2020లో ఆయనకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా అవకాశం లభించింది. పశ్చిమ బెంగాల్‌లో పార్టీ ప్రచార వ్యూహాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.

ఆరోగ్య సమస్యల కారణంగా ముకుల్ రాయ్ 2021లో క్రియాశీల రాజకీయాల నుండి వైదొలిగారు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, ఫలితాల తర్వాత ఆ పార్టీని వీడి తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గత కొన్నేళ్లుగా, ఆయన ఆరోగ్యం కారణంగా అంత యాక్టివ్‌గా లేరు. ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముకుల్ రాయ్ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు.