New Power Tariffs: త్వరలోనే దేశంలో కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. వీటి ప్రకారం పగటి పూట విద్యుత్ ఛార్జీలు 20 శాతం మేర తగ్గునుంచగా.. రాత్రిపూట 20 శాతం మేర విద్యుత్ ఛార్జీలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కొత్త విద్యుత్ నియమాలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విద్యుత్ వినియోగాన్ని సమతౌల్యం చేయడానికి వాడుక సమయాన్ని పీక్ అవర్స్, టైమ్ ఆఫ్ డే గా విభజిస్తారు. టైమ్ ఆఫ్ డేలో వినియోగం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వాడే విద్యుత్తుకు తక్కువ రుసుం వసూలు చేయాలని కేంద్రం పేర్కొంది. ఎలాంటి వినియోగదారులకు ఎప్పటి నుంచి ఈ నిబంధనను వర్తింపజేయాలో ఇందులో పూర్తిగా వివరించింది. పది కిలో వాట్లకు మించి డిమాండ్ ఉన్న వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు 2024 ఏప్రిల్ ఒకటవ తేదీ లోపు టైమ్ ఆఫ్ డే టారిఫ్ అమలు చేయాలని స్పష్టం చేసింది. వ్యవసాయ దారులు మినహా ఇతర వినియోగదారుల అందరికీ ఈ నిబంధనను 2025 ఏప్రిల్ 1వ తేదీలోపు వర్తింపజేయాలని పేర్కొంది. ఏడాది తర్వాత వ్యవసాయ రంగం మినహా, మిగతా అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు ఈ నియమాన్ని వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది.
సౌర విద్యుత్ చౌకని, సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యే పగటి సమయాల్లో విద్యుత్ ఛార్జీలు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. తద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. సౌర శక్తి అందుబాటులో లేని రాత్రి సమయాల్లో థర్మల్, హైడ్రో, గ్యాస్ ఆధారిత ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించారు. సౌర విద్యుత్ ఉత్పత్తి కంటే వాటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఈక్రమంలోనే రాత్రి వేళ విద్యుత్ ఛార్జీలను ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు. 2030 నాటికి శిలజాయేతర ఇధనాల శక్తి సామర్థ్యాన్ని 35 శాతం చేరేందుకు ఈ విధఆనం సహాయ పడుతుందని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. అలాగే 2070 నాటికి సున్నా ఉద్గారాల లక్ష్యానికి అనుగుణంగా ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఈ విధానం వల్ల సోలార్ విద్యుత్ వ్యవస్థ ఉన్న వినియోగదారులకు మేలు జరగనుంది. అలాగే పగటి పూట వినియోగించే విద్యుత్ కు తక్కువ ఛార్జీలు, రాత్రి వేళ వినియోగించే లైట్లు, ఫ్యానులు, ఏసీలు వంటి వాటికి ఎక్కువ విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. వినియోగదారులు విద్యుత్ వాడకం, తమ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ను రోజువారీగా మొబైల్ ఫోన్లలో చెక్ చేసుకునే వీలును కల్పించేందుకు కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విద్యుత్తు వినియోగదారుల హక్కులను సవరిస్తూ.. గురువారం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం డిస్కంలు అన్ని రకాల స్మార్ట్ మీటర్లను ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా రిమోట్ విధానంలో పరిశీలించాలి. స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్ వినియోగదారులకు వారి విద్యుతు వాడకానికి సంబంధించిన సమాచారాన్ని వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ లేదా ఎస్ఎంఎస్ ల ద్వారా అందుబాటులో ఉంచాలి. ఎప్పటికప్పుడు వారు తాము వాడిన యూనిట్లు, దానికి అయిన ఖర్చు, మిగిలిన నగదు నిల్వను తనిఖీ చేసుకోవడానికి వీలు కల్పించాలని విద్యుత్తు శాఖ పేర్కొంది.