Delhi Liquior Scam : ఢిల్లీ (Delhi)ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP)జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 3వ తేదీన తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ జరిగిందని, ఈ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే రెండు సార్లు కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసినా స్పందించకపోవడంతో, తాజాగా మూడోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శుక్రవారం కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చింది. 


విపాసన ధ్యాన కోర్సుకు వెళ్లిన కేజ్రీవాల్
నోటీసులు రావడానికి ముందే ధ్యాన శిక్షణకు గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లిపోయారు. షెడ్యూల్‌ ప్రకారమే విపాసన ధ్యాన కోర్సుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకు తనకు సమన్లు జారీ చేశారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. నిజాయతీతో పారదర్శకంగా జీవిస్తున్నానన్న కేజ్రీవాల్, తన జీవితంలో దాచడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తొలుత నవంబరు 2వ తేదీన విచారణకు హజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. మధ్యప్రదేశ్ ఎన్నికలు ప్రచారం ఉండటంతో విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈడీ డిసెంబరు 21న రెండోసారి సమన్లు ఇచ్చినా వెళ్లలేదు. ఇప్పుడు మూడోసారి నోటీసులు ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను ఇప్పటికే సీబీఐ 9గంటల పాటు విచారించింది. 


తీవ్రంగా ఖండించిన ఆప్​
సీఎం కేజ్రీవాల్​కు మరోసారి సమన్లు జారీ చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. మద్యం కుంభకోణం కేసు ఫేక్​, బోగస్​ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం కేసుకు సంబంధించి నమోదు చేసిన ఛార్జ్​షీట్లలో సీఎం కేజ్రీవాల్ పేరును అనేకసార్లు ప్రస్తావించింది ఈడీ. ఈ కేసులో నిందితులు కేజ్రీవాల్​తో నిరంతరం టచ్​లో ఉన్నారని ఆరోపించింది. ఎక్సైజ్ పాలసీ తయారీ నుంచి అమలు వరకు వివిధ అంశాలపై వీరంతా, ఆప్ అధినేత కేజ్రీవాల్ తో సంప్రదింపులు సాగించారని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, ఎంపీ సంజయ్​ సింగ్​ను అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణంపై సీబీఐ సైతం విచారణ జరుపుతోంది. 


సమీర్‌ మహేంద్రు, పి. శరత్ చంద్రారెడ్డి, బినయ్‌ బాబు, విజయ్‌ నాయర్, అభిషేక్‌ బోయినపల్లి ద్వారా ఈడీ స్టేట్​మెంట్లు తీసుకుంది. వాటి ఆధారంగా ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి తనయుడు మాగుంట రాఘవ్‌ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భాగస్వామిగా ఉన్న ఇండో స్పిరిట్స్ సంస్థ 14,05,58,890 బాటిళ్ల మద్యం విక్రయించింది. వాటి ద్వారా.1,028 కోట్లు సంపాదించినట్లు ఈడీ ఛార్జిషీట్‌లో వెల్లడించింది. ఇండో స్పిరిట్స్‌లోని వాటాను సౌత్‌ గ్రూప్‌లోని పాత్రదారులైన అరుణ్‌ పిళ్లై, ప్రేమ్‌ రాహుల్ అనే బినామీ ప్రతినిధులతో నడిపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపించింది. ఈ కేసుతో సంబంధమున్న 36 మందికి చెందిన 170 మొబైల్‌ ఫోన్​లు ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ్‌ రెడ్డి, శరత్​రెడ్డి, కె. కవిత నియంత్రణలో ఉన్న సౌత్ గ్రూప్, 100 కోట్ల ముడుపులను ఆప్ నేతల కోసం విజయ్‌ నాయర్‌కు ఇచ్చినట్లు పేర్కొంది.