ED Summons To Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) శనివారం నాలుగో సమన్లు ​​జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi Liquor Scam)లో ప్రశ్నించేందుకు ఈడీ ఆయనకు నాలుగోసారి సమన్లు ​​జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం జనవరి 18న ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని కేజ్రీవాల్‌కు సూచించింది. ఇప్పుడు ఆప్ జాతీయ సమన్వయకర్త నాలుగోసారి విచారణకు హాజరవుతారో లేదో చూడాలి.


మూడు సార్లు గైర్హాజరు
మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించింది. అనంతరం పలు సార్లు ఈడీ నుంచి కేజ్రీవాల్‌కు సమన్లు వచ్చాయి.  నవంబర్ 2, డిసెంబరు 21న విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ ఈ విచారణలకు ఆయన  హాజరు కాలేదు. రెండు నోటీసుల తర్వాత జనవరి 3న విచారణకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. వాటిని ఏమాత్రం పట్టించుకోని కేజ్రీవాల్, బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేకపోతున్నట్లు ఈడీకి సమాచారం ఇచ్చారు.


రాజ్యసభ ఎన్నికలు, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల పనుల్లో తాను బిజీగా ఉన్నానని, విచారణకు హాజరవ్వలేనని ఈడీకి కేజ్రీవాల్‌ రాతపూర్వక సమాధానాన్ని పంపారు. దర్యాప్తు సంస్థ పంపే ఎలాంటి ప్రశ్నావళికైనా జవాబులు తెలపడానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో తనను విచారించడానికి గల నిజమైన ఉద్దేశాన్ని తెలపాలంటూ ఇప్పటికే పలుమార్లు లేఖలు పంపానని వాటిపై ఈడీ స్పందించాలని కోరారు.


అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్ మూడు సార్లు ఈడీ నోటీసులను తిరస్కరించడంతో జనవరి 4న ఆయన్ను ఆరెస్ట్ చేస్తారంటూ ప్రచారం సాగింది. కేజ్రీవాల్‌ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేస్తుందని, ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. కేజ్రీవాల్ ఇంటికి వెళ్లే మార్గాన్ని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు దిగ్బంధించారని ప్రచారం సాగింది.  


స్పందించిన కేజ్రీవాల్
తన అరెస్ట్‌పై ఊహాగానాలు వస్తున్న క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్  కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రచారం చేయకుండా తనను అడ్డుకోడానికే బీజేపీ ఈ కుట్ర చేస్తోందని మండి పడ్డారు. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఈడీ ఇచ్చిన సమన్లు లీగల్‌గా చెల్లవని తేల్చి చెప్పారు.


కేంద్రం కుట్రలు
ఈడీ నోటీసులపై ఆప్‌ స్పందిస్తూ..  దర్యాప్తు సంస్థకు సహకరించడానికి కేజ్రీవాల్‌ సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఈ నోటీసులు ఎందుకు పంపారని..? ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని, అందుకే ఆయన్ను అరెస్టు చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆప్ ఆరోపించింది. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, అవినీతి నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. బీజేపీతో చేతులు కలిపిన వారిపై దర్యాప్తు సంస్థలు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆప్ ఆరోపించింది. దర్యాప్తుకు సహకరించడం అంటే నాయకులను అరెస్టు చేయడం కాదని వ్యాఖ్యానించింది.