Food News: కొత్త కొత్త రెసిపీల పేరుతో ఫుడ్ మీద ఎక్స్ పెరిమెంట్లు రోజు రోజుకూ మితి మీరుతున్నాయి. రుచి చూడటం కాదు, కళ్లతో చూస్తేనే కడుపులో తిప్పే ఫుడ్ మేకింగ్‌ని గొప్పగా వీడియో తీసి వ్యూస్ కోసం సోషల్ మీడియాలో పెడుతున్నారు కొందరు.  జనాలు చూస్తున్నారు కదా అని ఏది పడితే అది తీసి దానికి ఓవర్ బిల్డప్ ఇస్తూ యూట్యూబ్‌లో, ఇన్స్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ కోసం షేర్ చేస్తేన్నారు.  అది చూసిన నెటిజన్లు వాళ్లకి బాగా గడ్డి పెడుతున్నారు. ఇలాగే పెట్టిన మేకింగ్ ఆఫ్ ‘చీజ్ ఐస్ గోలా’కు వచ్చిన ఛీత్కారాలు చూడండి.


సిద్దార్థ్ షా అనే గుజరాతీ వీడియో లాగర్ కి ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దాదాపు రెండున్నర లక్షల మంది అతని ఎకౌంట్‌ని ఫాలో అవుతారు. గుజరాతీ భాషలో వీడియోలు తీసే ఇతను ఎక్కువగా అహ్మదాబాద్‌లో ఫేమస్ ఫుడ్ రెసిపీలు తన ఖాతాలో పోస్ట్ చేస్తాడు. ఇటీవల ఈయన పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. దీనికి పాజిటివ్‌ కంటే నెగిటివ్ రియాక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. 


చీజ్ వేసిన ఐస్ గోలా ఏంట్రా బాబు.. 


సాధారణంగా పీజాల్లోనో, బర్గర్లలోనో,  శాండ్ విచ్‌ల లోనో.. ఆఖరికి ఈ మధ్య ట్రెండ్ అయిన దోశల్లోనో చీజ్ వేయడం చూశాం.  కానీ  అహ్మదాబాద్‌లోని  ‘ఉమియా ఐస్ డిష్ గోలా- జూనాగఢ్ వాలా’ అనే చిన్న పాటి వీధి వ్యాపారి ఐస్ గోలాలో చీజ్ మిక్స్ చేసి కడుపులో తిప్పే డిష్ ఒకటి ప్రిపేర్ చేశాడు. ముందుగా ఐస్‌ని గ్రేడ్ చేసి చిన్న గోలాలా తయారు చేస్తాడు. దాని మీద రకరకాల రంగుల్లో ఉన్న షుగర్ సిరప్‌లు వేశాడు. దాని మీదే కొంత మలాయి క్రీమ్ వేశాడు. తరువాత డ్రై ఫ్రూట్స్ వేశాడు. అన్నిటి కంటే ముఖ్యగా ఆఖరికి అమూల్‌ చీజ్ దాని మీద బోలెడంత గ్రేడ్ చేశాడు. మళ్లీ కొంత రంగురంగుల సిరప్‌లు వేసి.. పైన కొంత చాక్లెట్ సిరప్ పోశాడు. ఒక్కసారి ఊహించుకోండి.. దీని టేస్ట్ ఎలా ఉంటదో. పుల్ల పుల్లగా తియ్య తియ్యగా ఉంటదని, ఒక్కసారి తప్పక ట్రై చేయాలని వ్లాగర్ సిద్ధార్థ్ చెబుతున్నా.. దానిపై నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు.


నీకు నరకంలొ కూడా చోటుండదు చూడు తమ్ముడూ.. 


ఈ చీజ్ గోలా వీడియోకు ఇప్పటి వరకూ మూడు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. కానీ ‘ఓరి దేవుడా ఇదేందయ్యా ఇదీ... ఐస్ గోలా మీద చీజా.. ఛీఛీ’ అంటూ నెటిజనన్లు ఈ వీడియోను విమర్శిస్తున్నారు. ‘ఇంత చండాలమైన కాంబినేషన్‌ని కూడా వైరల్ చేస్తున్నారా’  అంటూ చాలా మంది మండిపడటం కామెంట్లు  చూస్తే కనిపిస్తోంది. ‘ఇట్లాంటి వీడియోలు తీసి పోస్టు చేస్తున్న నీకు నరకంలో కూడా చోటుండదు చూడు తమ్ముడూ’ అని ఒకరు కామెంట్ చేస్తే. . ‘ఇలా చేసే వాళ్లమీద పోలీసు కేసులు ఎందుకు కావట్లేదు’ అని మరొకరు.. ‘ఎందుకయ్యా ఇలాంటివి తీసి చూపించి జనాల కడుపులు ఖరాబ్ చేస్తావ్’ అని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. ‘కలియుగం భాయ్.. ఇప్పుడు అన్నిట్లోనూ చీజ్ వేసేస్తున్నారు(హర్ చీజ్ మే చీజ్)’ అని మరికొందరు నిట్టూరుస్తున్నారు.  ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్లు మానేయాలని, ఇవన్నీ చూసి ట్రై చేస్తే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశముందని ఎక్కువ శాతం అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగింగ్ విషయంలో ఎలాంటి నియంత్రణా లేకపోవడంతో కనిపించిన వాటినన్నింటినీ పెద్ద ఎత్తున బిల్డప్పిస్తూ వ్లాగర్లు పోస్టు చేస్తున్నారు. వీటిలో ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత కచ్చితంగా వీక్షకులదే.