Dharmendra Pradhan Letter Summary: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశ యువతకు బహిరంగ లేఖ రాశారు. దేశ యువత ఆకాంక్షలను గౌరవిస్తూ తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇంతకీ ఆయన రాసిన లేఖ పూర్తి సారాంశం ఇక్కడ చదవచ్చు.
నా యువ మిత్రులారా,
నాలుగు దశాబ్దాలకు పైగా, నేను విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం అంకితమై పని చేశాను. పటిష్టమైన, సమ్మిళితమైన, దూరదృష్టితో కూడిన విద్యా వ్యవస్థే దేశానికి మూలస్తంభం అని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను.
దేశ యువత ఆకాంక్షలను, భావాలను న్యాయమైన డిమాండ్ లను నేను ప్రగాఢంగా గౌరవిస్తాను. దేశ యువతరం కలలను సాకారం చేయడం మన రాజకీయ, సామాజిక జీవితాల్లో ఒక నైతిక నిబద్ధతగా ఉంది.
ప్రధానమంత్రి దూరదృష్టి గల నాయకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు నేను వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే, 2026 మే 3న జరిగిన నీట్-యూజీ (NEET-UG) పరీక్షకు సంబంధించి అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.
ఈ విషయాన్ని వెంటనే సుమోటోగా స్వీకరించిన భారత ప్రభుత్వం, దర్యాప్తును సీబీఐకి అప్పగించి, పరీక్షను రద్దు చేసి, రీటెస్ట్ తేదీని ప్రకటించింది. అదనంగా, వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షను సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) విధానంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ సమయంలో 20 లక్షలకు పైగా విద్యార్థులకు సంబంధించిన పరీక్ష సజావుగా జరిగేలా చూడటమే మా ప్రధాన కర్తవ్యం. మేము సమైక్య ప్రభుత్వ విధానాన్ని అనుసరించి పనిచేశాం; కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా జిల్లా యంత్రాంగాలు కీలక పాత్ర పోషించాయి.
విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారంతో, 2026 జూన్ 21న పరీక్ష విజయవంతంగా ముగిసింది. మొదటి రోజు నుంచే నేను పూర్తి బాధ్యత తీసుకున్నాను, ఈ పరిస్థితి నుంచి ఎన్నడూ వెనక్కి తగ్గలేదు. పరీక్ష పేపర్ లీకేజీ మాఫియా వల్ల ఏ ప్రతిభావంతుడైన విద్యార్థి నష్ట పోకడదని, ఏ విద్యార్థికి అన్యాయం జరగకూడదని నేను భావించారు.
జూలై 16న ప్రకటించిన నీట్-యూజీ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి, నిరుపేద వర్గాలకు చెందిన ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులు విజయం సాధించారు. అయినప్పటికీ, ఈ సమయంలో కూడా, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు వ్యక్తులు అడ్డంకులు సృష్టించి, విద్యార్థులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు, ఇది నాకు తీవ్రమైన ఆవేదన కలిగించింది.
మన ప్రజాస్వామ్య శక్తిపై నాకు అచంచలమైన విశ్వాసం ఉంది, యువత ఆకాంక్షలను, కలలను, అంచనాలను నేను ఎంతగానో గౌరవిస్తాను. వారు కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు; వారు నూతన, అభివృద్ధి చెందిన భారతానికి మార్గదర్శకులు, నిర్మాతలు, రూపశిల్పులు.
గడిచిన పది రోజుల ఘటనలతో నేను తీవ్రంగా బాధపడ్డాను. ఇది నాకు వ్యక్తిగత పరువుకు సంబంధించిన విషయం కాదు. దేశ యువశక్తియే ఈ దేశానికి నిజమైన బలం. దేశ యువత గందరగోళంలో పడకుండా చూడాలన్నది నా సంకల్పం.
జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, దేశ వ్యతిరేక శక్తులు దానిని దుర్వినియోగం చేయకుండా నిరోధించడం, జాతీయ ఐక్యతను పరిరక్షించడం, ఒక్క భారతీయ విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకుండా చూడటం, మన పిల్లలు తమ సమయాన్ని చదువులకు కేటాయించి, తమ భవిష్యత్ ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టేలా చేయడం వంటి లక్ష్యాలతో నేను గౌరవనీయ ప్రధానమంత్రికి నా రాజీనామాను సమర్పించాను.
ప్రధానమంత్రి మార్గదర్శకత్వానికి, నమ్మకానికి, నిరంతర మద్దతుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంత్రివర్గంలోని నా సహచరులందరికీ, విద్యాశాఖ అధికారులకు, సిబ్బందికి, నేను కలిసి పనిచేసే అవకాశం లభించిన వ్యక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
దేశ సేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యత; నేను ఎల్లప్పుడూ ఈ ఆశయానికి అంకితమై ఉంటాను. జగన్నాథ స్వామి ఆశీస్సులతో, భవిష్యత్తులో కూడా మాతృభూమి, ఒడిశా ప్రజలు, దేశ యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి సాధ్యమైనంత నన్ను నేను అంకితం చేసుకుంటూనే ఉంటాను.
ఇట్లు, ధర్మేంద్ర ప్రధాన్.
