చెన్నై: డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా పరంగా జరకూడదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గుతాయి. దాంతో లోక్‌సభ, రాజ్యసభలలో మా ప్రాతినిధ్యం తగ్గితే, అది మా రాష్ట్రాలకు నిధులు సాధించడంలో ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. ఫెయిర్ డీలిమిటేషన్ (Fair Delimitation)పై చెన్నైలో జరిగిన సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ, డీలిమిటేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ జనాభా ప్రాతిపదికన జరగకూడదు. అదే కనుక జరిగితే జనాభా నియంత్రంణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ, రాజ్యసభలో సీట్లు తగ్గుతాయి. తరువాత దక్షిణాది రాష్ట్రాలకు ఇష్టం లేకపోయినా, మేం వ్యతిరేకించినా చట్టాలు చేస్తారని స్టాలిన్ అభిప్రాయపడ్డారు.
‘దక్షిణాది ప్రజలు నష్టపోయేలా చేసే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు సైతం పలు విషయాల్లో అవకాశాలను కోల్పోతారు. కనుక దక్షిణాది రాష్ట్రాలు ఏకమై మన హక్కులను కాపాడుకునేందుకు పోరాటం కొనసాగించాలి. మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చిన అందరకీ ధన్యవాదాలు. ఇదే తీరుగా మన హక్కుల కోసం రాజకీయాలకు అతీతంగా నేతలు కలిసి రావాలి. లేకపోతే దక్షిణాది సంస్కృతి, సాంప్రదాయం ఉనికి ప్రమాదంలో పడుతుంది. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి ప్రమాదంలో పడుతుంది. సామాజిక న్యాయం జరగదు. నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే మన ప్రాతినిధ్యం తగ్గి, రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలు బలహీనంగా మారతాయని" స్టాలిన్ అన్నారు.
డీలిమిటేషన్ పై సీఎం స్టాలిన్ అధ్యక్షతన చెన్నై గిండి సమీపంలోని ఐటీసీ ఛోళా హోటల్ లో దక్షిణాది పార్టీల జేఏసీ భేటీ అయింది. దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, కీలక పార్టీల నేతలు హాజరయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, లతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేడీ, ఏఐఎంఐఎం, ఇతర పార్టీల నేతలు పాల్గొని ప్రసంగిస్తున్నారు.