Delhi Services Bill Passes In Rajya Sabha: ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023ని సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. కేంద్రం తీసుకొచ్చిన దిల్లీ సర్వీసుల బిల్లుపై సభలో ఓటింగ్ జరగగా మద్దతుగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 102 ఓట్లు పోలయ్యాయి. మెజార్టీ రావడంతో ఢిల్లీ సర్వీసుల బిల్లు రాజ్యసభలో లభించింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్‌ నిర్వహించగా ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాజ్యసభ సైతం ఆమోదం తెలిపింది. ఇరు సభలలో బిల్లుకు ఆమోదం రావడంతో ఇక రాష్ట్రపతికి బిల్లును పంపనున్నారు. తదుపరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేస్తే ఢిల్లీ సర్వీసుల బిల్లు చట్టంగా మారనుంది.


కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఢిల్లీ సర్వీసుల బిల్లు అంశంలో సుప్రీం కోర్టు తీర్పును ఎవరూ ఉల్లంఘించలేరన్నారు. ఢిల్లీలో అవినీతి రహిత పాలనను అందించాలన్న లక్ష్యంతోనే సర్వీసుల బిల్లును తెచ్చామన్నారు. తమపై విమర్శలు చేయడం కాదని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ బిల్లును తొలిసారిగా తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ బిల్లు చట్టంగా మారితే అధికారుల, ఉద్యోగుల విధులు, ఇతర సర్వీసులకు సంబంధించిన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.






కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన బిల్లులో ఏ నిబంధనను ఎన్డీఏ సర్కార్ మార్చలేదన్నారు. కానీ తమ మిత్రుడైన ఆమ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూల్ చేయడానికే కాంగ్రెస్ పార్టీ గతంలో తాము తెచ్చిన బిల్లును వ్యతిరేకిస్తూ డ్రామాలు చేస్తుందన్నారు. గత వారం విపక్ష సభ్యులు ఆందోళన చేస్తుండగానే లోక్ సభలో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించడం తెలిసిందే. కేంద్రం తీరును నిరసిస్తూ విపక్ష సభ్యులు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 


లెఫ్టినెంట్‌ గవర్నర్‌కి ఢిల్లీలోని పరిపాలన సేవలపై నియంత్రణను అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినప్పటి నుంచి ఆప్ ప్రభుత్వం మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది. కేజ్రీవాల్ ఆ బిల్లును వ్యతిరేకించాలని కాంగ్రెస్ సహా మిత్రపక్షాలను మద్దతు కోరడంతో.. విపక్ష పార్టీలు ఢిల్లీ సర్వీసుల బిల్లును వ్యతిరేకించాయి. ‘నేషనల్‌ కేపిటల్‌ సివిల్‌ సర్వీస్‌ అథారిటీ’ ఏర్పాటు చేసి గ్రూపు-ఎ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని మోదీ ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్ ను చట్టం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల రిక్రూట్ మెంట్, బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు మే 11న తీర్పు ఇచ్చింది. అనంతరం మే 19న కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఢిల్లీ సర్వీసుల బిల్లును ప్రవేశపెట్టింది. గత వారం లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లుకు నేడు (సోమవారం) రాజ్యసభ సైతం ఆమోదించింది. ఉభయ సభలలో ఆమోదం పొందిన ఈ బిల్లును చట్టం చేయాలంటే రాష్ట్రపతి ఆమోదం కావాలి. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ సర్వీసుల బిల్లును ఆమోదించాలని కోరుతూ రాష్ట్రపతికి పంపనుంది.