ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న సాయంత్రం జరిగిన ఘోర పేలుడు కేసులో దర్యాప్తు అధికారులు కీలక విషయాలు గుర్తించారు.  ప్రధాన నిందితులలో ఒకడైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్.. గణతంత్ర దినోత్సవం, దీపావళి వంటి జాతీయ కార్యక్రమాల సమయంలో ఉగ్రదాడులు చేయడానికి ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడని తెలుస్తోంది. పండగులు, పెద్ద ఈవెంట్ల సమయాల్లో ఢిల్లీ వ్యాప్తంగా పలుచోట్ల దాడి చేయాలని ఈ ఏడాది మొదట్నుంచే ఉగ్రకుట్నకు ప్లాన్ చేసినట్లు ఒక్కో విషయం విచారణలో బయటకు వస్తోంది.

Continues below advertisement

ఎర్రకోట పేలుడు దర్యాప్తు

అధికారుల అనధికారిక సమాచారం ప్రకారం, ముజమ్మిల్ విచారణలో తన సహచరుడు ఉమర్‌తో కలిసి ఈ ఏడాది ప్రారంభంలో ఎర్రకోట ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు అంగీకరించాడు. జనవరి 26, 2026న గణతంత్ర దినోత్సవం (Republic Day) వేడుకల సమయంలో దాడి చేయడానికి ఈ రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. ముజమ్మిల్ మొబైల్ ఫోన్ నుండి సేకరించిన లొకేషన్ డేటా, ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలకు చాలాసార్లు వెళ్లినట్లు నిర్ధారించింది. ఇండియా టుడే కథనం ప్రకారం, దీపావళి సమయంలో దాడి చేసేందుకు మొదట ప్లాన్ చేసుకున్నా.. చివరి నిమిషంలో తమ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు కూడా అతను వెల్లడించాడు.

పుల్వామాకు చెందిన సీనియర్ డాక్టర్ అయిన ముజమ్మిల్, ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీగా పనిచేశాడు. జైషే మహ్మద్ (JeM), అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGuH) వంటి నిషేధిత సంస్థలతో సంబంధాలు ఉన్న "వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్"తో ముజమ్మిల్‌కు సంబంధాలు ఉన్నాయని అధికారుల నమ్మకం విచారణలో క్రమంగా బలపడుతోంది.

Continues below advertisement

ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్, నవంబర్ 10న ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హ్యుందాయ్ i20 కారులో పేల్చివేసుకుకుని మృతిచెందాడు. ఈ పేలుడులో 12 మంది మరణించగా, 20 మంది వరకు గాయపడ్డారు. దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. పేలుడు తరువాత ఢిల్లీ మొత్తం భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు, పారామిలిటరీ బలగాలు గస్తీని పెంచాయి. గాజీపూర్, సింఘు, టిక్రీ, బదర్‌పూర్ సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. మెట్రో స్టేషన్లు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్‌ లాంటి జనసంచారం అధికంగా ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కీలకమైన ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్‌లు, మెటల్ డిటెక్షన్ బృందాలను మోహరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు లేదా వస్తువులేమైనా కనిపిస్తే వెంటనే అత్యవసర హెల్ప్‌లైన్‌లకు సమాచారం అందించాలని అధికారులు ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.