Animal in Rashtrapati Bhavan: నరేంద్ర మోదీ సహా ఆయన ఎంపిక చేసిన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కనిపించిన జంతువుపై ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆదివారం (జూన్ 9) కేంద్రమంత్రులు ప్రమాణం చేస్తున్న సమయంలో వెనుకవైపు నుంచి రాష్ట్రపతి భవన్ ప్రవేశం వద్ద ఓ జంతువు అటు వైపు వెళ్తూ కనిపించింది. అది రాత్రి వేళ కావడంతో ఆ జంతువు ఏంటనేది కెమెరాలో స్పష్టంగా కనిపించలేదు. ఆ జంతువు ఆకారం నడకను బట్టి అది చిరుత పులి అని చాలా మంది భావించారు. అయితే చిరుత పులి రాష్ట్రపతి భవన్‌లో ఉంటాయా? దాన్ని పెంచుకుంటారా? అన్న సందేహాలు కూడా వ్యక్తం అయ్యాయి. రాష్ట్రపతి భవన్ లోని సిబ్బంది ఎవరైనా జంతువును పెంచుకుంటున్నారేమో అని కూడా ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి.


ఈ వీడియో వైరల్ కావడంతో దేశ వ్యాప్తంగా మీడియాలో ఇదే హైలైట్ అయింది. వీడియో చూసిన వాళ్లంతా రకరకాలుగా స్పందిస్తూ వచ్చారు. ఆ జంతువు కుక్కా? లేదా ఏదైనా జాతికి చెందిన వింత పిల్లా? అని కూడా కామెంట్లు వచ్చాయి. మొత్తానికి ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.


‘‘కొన్ని మీడియా ఛానెళ్లు రాష్ట్రపతి భవన్ లో కనిపించిన జంతువు గురించి అనేక రకాలుగా వార్తలు ప్రసారం చేస్తున్నారు. లైవ్ టెలికాస్ట్ లు కూడా ఇస్తున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం సమయంలో కనిపించిన ఆ జంతువు ఏ రకమైన హానికారక జంతువు కాదు. అది కేవలం సాధారణ పిల్లి మాత్రమే. ఈ విషయం గురించి ఎలాంటి ఊహాగానాలు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు’’ అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.