Delhi Chalo Farmers Protest:  వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌(MSP)కు చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించ‌డంతోపాటు.. వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త స్వామినాథ‌న్(Swaminathan commission) క‌మిష‌న్ సిఫార‌సు(recomondations)ల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తున్న రైతులు(Farmer).. `ఢిల్లీ చ‌లో`(Delhi chalo) కార్యక్ర‌మానికి మ‌రోసారి సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో 14 వేల మంది రైతులు, 1200 ట్రాక్ట‌ర్లు, ట్రాలీలు, 300 కార్లు, 10మినీ బ‌స్స‌ల‌తో అన్న‌దాత‌లు ఉద్య‌మానికి క‌దులుతున్నారు. పంజాబ్‌-హ‌రియాణ స‌రిహ‌ద్దుల్లో మోహ‌రించారు. దీంతో అటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా అలెర్ట‌య్యాయి. ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా భారీ సంఖ్య‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను మోహ‌రించాయి. 


చ‌ర్చ‌లు విఫ‌లం..


గ‌త కొన్ని రోజులుగా రైతులు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌(MSP)కు చ‌ట్ట బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని, రైతుల‌కు, రైతు కూలీల‌కు.. పింఛ‌న్లు ఇవ్వాల‌ని, స్వామినాథ‌న్‌సిఫార‌సుల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్‌చేస్తూ.. ఉద్య‌మానికి రెడీ అయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ త‌దిత‌రులు అన్న‌దాత‌లతో చ‌ర్చ‌లు చేప‌ట్టారు. అయితే.. ఈ చ‌ర్చ‌లు స‌ఫ‌లం కాలేదు. దీంతో బుధవారం(ఈ రోజు) ఉదయం 11 గంటల లోగా త‌మ డిమాండ్ల‌పై ప్రభుత్వం సానుకూలం స్పందించాలని, లేకపోతే `ఢిల్లీ చలో' కార్యక్రమం యాథావిధిగా కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ క్రమంలో ఏం జరిగినా దానికి కేంద్రం బాధ్యత వహించాలని రైతు సంఘాల నాయ‌కులు తేల్చి చెప్పారు.


ప్ర‌భుత్వం ఆంక్ష‌లు


రైతుల ఢిల్లీ చలో ఆందోళనల నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం ఆంక్ష‌లు విధించింది. ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్(రీఛార్జ్, బ్యాంకింగ్ సేవలు మినహా) సేవలపై విధించిన నిషేధాన్ని పొడిగించింది. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిస్సార్, ఫతేహాబాద్, శిర్సా జిల్లాలో ఈ ఇంటర్నెట్, ఎస్​ఎంఎస్ సేవలపై నిషేధం ఉండనుంది. అదేవిధంగా భారీ సంఖ్య‌లో పోలీసుల‌ను స‌రిహ‌ద్దు జిల్లాల‌కు త‌ర‌లించింది.


చ‌ర్చ‌లు ఏమ‌య్యాయి?


రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు జ‌రుపుతున్న చర్చలు విఫ‌ల‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికి నాలుగు సార్లు చ‌ర్చ‌లు జ‌రిపినా..ఫ‌లితం ల‌భించ‌లేదు. నాలుగో విడ‌త ఆదివారం జరిపిన చ‌ర్చ‌ల్లో కేంద్ర మంత్రులు కీలక ప్రతిపాదనలు చేశారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కే వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు కొనుగోలు చేసేలా రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు  కొనుగోలు చేస్తాయని ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు కొద్దిసేప‌టికే ప్రకటించాయి. ఎంఎస్​పీపై కేంద్రం ప్రతిపాదన రైతుల ప్రయోజనాల కోసం కాదని రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ ధల్లేవాల్ ఆరోపించారు. అందుకే ఎంఎస్​పీపై కేంద్రం చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని తెలిపారు.


క‌శ్మీర్ వాతావ‌రణం! 


బుధవారం(ఈరోజు) తలపెట్టిన ఢిల్లీ చలో కార్యక్రమంపై రైతు సంఘం నాయకుడు సర్వాన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. ``మమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఢిల్లీలో అడుగుపెట్టనివ్వకూడదన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. చర్చల ద్వారా స‌మ‌స్య పరిష్కారం కావాలనుకుంటే ఢిల్లీ వైపు వెళ్లేందుకు అనుమతించాలి. మేము ఢిల్లీ వైపు వెళ్లినప్పుడు కాల్పులు జరిగాయి. ట్రాక్టర్ల టైర్లకు కూడా బుల్లెట్లు తగిలాయి. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇలాంటి వాటిని ప్రయోగించే వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. రైతు ఉద్య‌మంపై తప్పుడు ప్రకటనలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం హరియాణా పరిస్థితి కశ్మీర్​లా తయారయ్యింది. మేము అసలు డిమాండ్ల నుంచి వెనక్కు తగ్గేలా కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఇప్పుడు ఏం జరిగినా దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది`` అని హెచ్చరించారు.


విప‌క్షాల‌కూ సెగ‌!


రైతులు చేస్తున్న ఉద్య‌మ సెగ ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు కూడా త‌గులుతోంది. 5 ప్ర‌ధాన‌ పంటలకు కాంట్రాక్టు కుదుర్చుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీని ద్వారా ఇప్పటికే సాగు చేస్తున్న రైతులు ఆ కాంట్రాక్టు పరిధిలోకి రాలేని ప‌రిస్థితి ఉంటుంది. అంతేకాకుండా కేంద్రం ఐదేళ్ల కాలపరిమితి పెట్టడం సరికాదనే అభిప్రాయం ఎక్కువ‌గా వినిపిస్తోంది. సరైన చట్టం లేకపోవడం వల్ల జ‌రుగుతున్న‌ దోపిడీని ఎమ్​ఎస్​పీ చట్టం ద్వారా నియంత్రించాల‌నేది ప్ర‌ధాన డిమాండ్‌. కానీ, కార్పొరెట్ శక్తులు దీనికి అడ్డుపడుతున్నాయనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో విప‌క్షాలు త‌మ‌తో క‌లిసి రావాల‌ని.. లేక‌పోతే.. ఎన్నిక‌ల వేళ త‌మ ప్ర‌తాపం చూపిస్తామ‌ని రైతు సంఘాలు హెచ్చ‌రిస్తున్నాయి.