Military Equipment: భారత సైనిక దళాల పోరాట సామర్థ్యానికి పటిష్టం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా ఆయుధ సమీకరణకు (Military Equipment) కేంద్రం (Central Government) ఆమోదం తెలిపింది. రూ.84,560 కోట్ల విలువైన సైనిక పరికరాలు, సాధన సంపత్తి కొనుగోలుకు శుక్రవారం పచ్చ జెండా ఊపింది. కేంద్ర రక్షణ మంత్రి (Defence Minister Of India) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీలో ఆయుధ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశమైంది. కొత్తతరం ట్యాంకు విధ్వంసక మందుపాతరలు, గగనతల రక్షణకు ఉద్దేశించిన కంట్రోల్ రాడార్, భారీ టోర్పిడోలు, మధ్యశ్రేణి సముద్ర నిఘా, బహుళ ప్రయోజన విమానం, విమానాలకు గగనతలంలోనే ఇంధనం నింపే సాంకేతికత, సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియోలను సైనిక దళాల కోసం కొనుగోలు చేయనున్నారు.
దేశంలోని పెద్ద సముద్ర ప్రాంతాలను మరింత మెరుగ్గా పర్యవేక్షించేందుకు భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ కోసం కొత్త విమానాలు, పరికరాలను కొనుగోలుకు ఆమోదం తెలిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ నిఘా, సామర్థ్యాలను బలోపేతం చేయడం కోసం మధ్యస్థ రేంజ్ మారిటైమ్ రికనైసెన్స్, మల్టీ - మిషన్ మారిటైమ్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలుకు DAC ఆమోదించింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా.. స్వదేశీసంస్థల నుంచే పరికరాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
సముద్ర నిఘా కోసం కేటాయించిన సీ-295 ఎయిర్ క్రాఫ్ట్‌లను ఎయిర్ బస్ తయారుచేయనుంది. వీటిని స్పెయిన్, ఇండియాలో తయారవుతాయి. అలాగే సుదూర, కనిపించని లక్ష్యాలను ఛేదించేందుకు ప్రత్యేక వ్యవస్థను కొనుగోలు చేయడానికి కేంద్రం ఆమోదించింది. చిన్న, తక్కువ ఎత్తులో ఎగిరే వాటిపై నిఘా పెట్టేలా వాయు రక్షణను మెరుగుపరిచేందుకు రాడార్ వ్యవస్థ కొనుగోలకు కూడా ఆమోదించింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను బలోపేతం చేయడానికి.. ముఖ్యంగా నెమ్మదిగా, చిన్న, తక్కువ ఎత్తుఎగిరే లక్ష్యాలను గుర్తించే సామర్థ్యం, వివిధ లక్ష్యాలపై నిఘా, ట్రాకింగ్ కోసం ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడార్‌ను కొనుగోలు చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపింది.
దీనితో పాటుగా ఇండియన్ నేవీ కోసం సముద్రంలో సుదూరంగా ఉన్న జలాంతర్గాములను గుర్తించే అధునాతన సోనార్ సాంకేతికతను కొనుగోలు చేయనున్నారు. శత్రువుల నుంచి వచ్చే ముప్పుల గుర్తించి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, భారత నావికాదళ నౌకలను ఒక అడుగు ముందు ఉంచడానికి, శత్రు జలాంతర్గాములను సుదూర శ్రేణిలో గుర్తించడానికి తక్కువ పౌనఃపున్యాలు, వివిధ లోతులలో పనిచేయగల సామర్థ్యం ఉన్న యాక్టివ్ టోవ్డ్ అర్రే సోనార్‌ను కూడా కొనుగోలు చేయనుంది.