Tax Notice to Women After Death:

  చనిపోయిన మహిళకు పది సంవత్సరాల తరువాత ఐటీ డిపార్ట్ మెంట్‌ వారు 7.5 కోట్ల పన్ను కట్టాలంటూ నోటీసులు అందజేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఉషా సోనీ పేరుతో సుమారు రూ. 7.56 కోట్లు పన్ను నోటీసు వచ్చిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ సూపరింటెండెంట్ కి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 


ఉషా సోని అనే మహిళ సుమారు పది సంవత్సరాల కిందట అంటే 2013 లోనే చనిపోయారు. కానీ ఇటీవల ఆమె పేరుతో ఐటీ శాఖ వారి నుంచి ఓ నోటీసు వచ్చింది. ఏంటా అని కుటుంబ సభ్యులు దానిని తీసి చూడగా.. ఆమె ప్రభుత్వానికి సుమారు రూ.7.56 కోట్లు పన్ను కట్టాలని నోటీసులలో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. దీని గురించి నోటీసులు అందజేసిన సదరు సంస్థను ప్రశ్నించగా వారు రకరకాల సమాధానాలు తెలిపారు. అంతేకాకుండా ఉషా సోని కి సంబంధించిన పాన్‌ వివరాలను 2017-18 లో నేచురల్ కాస్టింగ్‌ అనే సంస్థ వేరేవారికి స్క్రాప్‌ ని విక్రయించడానికి ఉపయోగించినట్లు వారికి తెలిపారు.


పన్ను నోటీసు కూడా ఆ కంపెనీకి చెందిన లావాదేవీకి సంబంధించినదే. ఉషా సోనికి చెందిన పాన్ వివరాలను అక్రమంగా ఉపయోగించుకోవడంతో పాటు ఆమె పేరు మీద లావాదేవీలు జరిపిన వారిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఎస్పీని కోరారు. దీని గురించి ఉషా సోని కుమారుడు పవన్‌ మాట్లాడుతూ.. కేవలం ఒక్క సంవత్సరం అది కూడా 2017-18 సంవత్సరానికి గానూ ఆమె పేరు మీద సుమారు రూ. 7.56 కోట్ల పన్ను కట్టాలంటూ మాకు నోటీసు అందింది. ఉషా సోని 2013లోనే టీచర్‌ గా చేస్తూండగా కాలేయ వ్యాధి వచ్చి మరణించారు. 


పది సంవత్సరాల తరువాత ఆమె పేరు మీద ఇంత పెద్ద మొత్తంలో పన్ను చెల్లించాలని నోటీసు వచ్చిందంటే..ఆమె కు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, పాన్ కార్డు వివరాలను ఎవరో తప్పుగా వాడుకునేందుకు ఉపయోగిస్తున్నారు. వాటి గురించి పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన వివరించారు. 


నేను ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాను . కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టాలంటే నా వల్ల కాదు అని పేర్కొన్నారు. "ఈ కేసులో పోలీసులు,   పన్ను శాఖ వారు మాకు సహాయం చేయాలని,  వ్యాపార లావాదేవీలను నిర్వహించడానికి మరణించిన వ్యక్తి  పాన్ వివరాలను ఉపయోగించిన కంపెనీపై చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము" అని పవన్ మీడియాకు తెలిపారు. 


ఈ విషయం గురించి  బేతుల్ ఎస్పీ సిద్ధార్థ్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయమై మాకు ఫిర్యాదు అందింది, పాన్ వివరాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి సమాచారం కోరామని తెలిపారు. ఐటీ శాఖ నుంచి సమాచారం అందుకున్న తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బేతుల్ ఎస్పీ సిద్ధార్థ్ చౌదరి తెలిపారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial