Cyclone Michaung News in Telugu: 


తుఫాన్ ప్రభావం..


మిగ్జాం తుఫాన్ ప్రభావం చెన్నైపై (Cyclone Michaung) కొనసాగుతూనే ఉంది. తమిళనాడులోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. దాదాపు నాలుగు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. చెన్నై నుంచి (Chennai Floods) వెళ్లాల్సిన 15 రైళ్లను రద్దు చేశారు. ఒడిశాలోనూ పంట నష్టం (Odisha Cyclone Michaung) భారీగా నమోదైంది. అటు ఏపీలోనూ ఈ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వచ్చే 12 గంటల్లో తుఫాను బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. చేపల వేటకు మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లకూడదని ఇప్పటి వరకూ హెచ్చరించింది IMD. క్రమంగా ఈ ప్రభావం తగ్గే అవకాశమున్నందున ఈ హెచ్చరికల్ని ఉపసంహరించుకుంది. అయితే...తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఈ ఎఫెక్ట్‌ కొనసాగుతోంది. చెన్నై, వెలచెరి, తంబరం ప్రాంతాలు భారీ వర్షాలతో (Cyclone Michaung Effect) సతమతం అవుతున్నాయి. వాటర్ సప్లై నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకీ అంతరాయం కలిగింది. మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి పవర్ సప్లైని రీస్టోర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిత్యావసర సరుకులనూ అందిస్తున్నారు. 


రాజ్‌నాథ్ సింగ్ ఏరియల్ సర్వే


చెన్నైలోని వరద పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. అవసరమైన సహాయం చేసేందుకు ముందుంటామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెన్నైలో పర్యటించనున్నారు. ఇవాళ (డిసెంబర్ 7) ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వరద పరిస్థితులను సమీక్షించనున్నారు. రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు ఓ మంత్రి ఏరియల్ సర్వే చేయనున్నారు. ఏరియల్ సర్వే పూర్తైన తరవాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌తో పాటు మరి కొందరు కీలక అధికారులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీ కానున్నారు. 


ఇప్పటి వరకూ అప్‌డేట్స్ ఇవీ..


వరదల కారణంగా చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్‌పట్టు ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వీధుల్లో ఎక్కడికక్కడ వరద నీళ్లు నిలిచిపోయాయి. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో వరద నీటిని బయటకు పంపలేకపోతున్నారు అధికారులు. చిన్నారులను, మహిళలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పడవల్లో వాళ్లను వేరే ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ (MK Stalin) ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో సందర్శించారు. నిత్యావసర సరుకులు అందించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సాయం కింద రాష్ట్రానికి రూ.5,060 కోట్లు అందించాలని విజ్ఞప్తి చేశారు.