Cyclone Biparjoy: 



46 వేల మంది తరలింపు..


అరేబియన్ సముద్రం నుంచి వేగంగా గుజరాత్‌వైపు దూసుకొస్తోంది బిపార్‌జాయ్ తుపాను. గుజరాత్‌పై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదముందని ఇప్పటికే హెచ్చరించింది IMD.కొన్ని గంటల్లోనే ఆ ఎఫెక్ట్ మొదలవుతుందని తేల్చి చెప్పింది. కచ్‌తో పాటు సౌరాష్ట్రలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దీనిపై కచ్ కలెక్టర్ అమిత్ అరోరా స్పందించారు. ఈ ప్రాంతాల్లోని 46 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడించారు. అంతే కాదు. 20 వేల పశువులనూ సురక్షిత ప్రదేశాలకు తరలించినట్టు తెలిపారు. ప్రత్యేకంగా షెల్టర్‌ హోమ్‌లు ఏర్పాటు చేశారు. నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ అందుబాటులో ఉంచారు అధికారులు. బలమైన గాలులు వీచి రోడ్లకు అడ్డంగా వాహనాలు, చెట్లు పడిపోయే ప్రమాదముందని IMD హెచ్చరించింది. ఈ రోడ్స్‌ని క్లియర్ చేసేందుకు 50 టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం జకావ్ పోర్ట్ నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉంది తుపాను. అటు ద్వారకా నుంచి 195 కిలోమీటర్లు, పోర్‌బందర్‌కి 275 కిలోమీటర్లు, పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి 255 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మాండ్వి, ద్వారకాలో ఇప్పటికే బలమైన గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలూ కురుస్తున్నాయి. సౌరాష్ట్ర, కచ్, జకావ్ పోర్ట్‌ని గట్టిగానే తాకనుంది బిపార్‌జాయ్. ఇక్కడికి చేరుకునే సమయానికి గంటకు 115-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. సముద్రంలోని అలలు 2.5 మీటర్ల ఎత్తులో ఎగిసిపడనున్నట్టు IMD వెల్లడించింది. 









రివ్యూ మీటింగ్..


తుపాను ప్రభావాన్ని అంచనా వేసే పనిలో ఉంది గుజరాత్ ప్రభుత్వం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌లో అధికారులతో భేటీ అయ్యారు. తుపాను ప్రభావంతో ఫ్లైట్ సర్వీస్‌లనూ రద్దు చేశారు. జామ్‌నగర్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఇదే విషయాన్ని వెల్లడించారు. జూన్ 15,16 వ తేదీల్లో అన్ని సర్వీస్‌లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.