న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో పాటు  సౌరవ్‌ దాస్, అశుతోష్‌ రాంకాలను పోలీసులు విడుదల చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలనే డిమాండుతో శనివారం జంతర్‌ మంతర్‌వద్ద ఆందోళన చేపట్టడానికి ఢిల్లీకి వచ్చిన సీజేపీ నేతలను విమానం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం వారిని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా.. ఆ ముగ్గురిని విడుదల చేయాలని ఆదేశించారు. న్యాయమూర్తి  సీజేపీ కీలక నేతలను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారని  సీజేపీ నేత రత్నాసింగ్‌ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.  

Continues below advertisement

ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం..అభిజిత్ దీప్కే అరెస్టుతో సీజేపీ ఇన్‌ఛార్జ్‌ అయిన అజింక్య శిండే ఆధ్వర్యంలో ఆదివారం నాడు జంతర్‌ మంతర్‌వద్ద నిరసన కొనసాగిస్తామని ప్రకటించారు. వరుసగా రెండో రోజు కూడా ఆందోళన కొనసాగుతుందని చెప్పడంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 30,000 మందికి పైగా పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది మోహరించారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, సరిహద్దు ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు లాంటి ప్రదేశాల పోలీసులు నిఘాను పెంచారు. 

సీజేపీ నేతల విడుదలకు కోర్టు షరతులు ?

ఢిల్లీలో ఆందోళన చేపట్టేందుకు వచ్చి అరెస్ట్ అయిన సీజేపీ ముఖ్య నేతల విడుదలకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు ఓ షరతు విధించిందినట్లు తెలుస్తోంది. ఏడాది పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకూడదు అనే కండీషన్‌తో వీరికి బెయిల్ మంజూరు చేశారు. దాంతో 50 వేల ష్యూరిటీ, బాండ్ సమర్పించినట్లు సమాచారం. అదే నిజమైతే సీజేపీ నేతలు ఇకనుంచి ఎలాంటి ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టలేరా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీజేపీ ఉద్యమాలు, ఆందోళనలు ఇక కొనసాగించే అవకాశం ఉండదా అని ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

తనను అక్రమంగా నిర్బంధించినందుకు పోలీసులపై కేసు నమోదు చేయాలని, తను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీజేపీ లీగల్ అఫైర్స్ హెడ్ రత్నా సింగ్ పిటిషన్‌ను శనివారం ఢిల్లీ కోర్టు కొట్టివేసింది.

ఈ ముగ్గురు సిజెపి నాయకులపై భారత్ న్యాయ సురక్ష సంహితలోని సెక్షన్ 126 (శాంతిభద్రతల పరిరక్షణకు పూచీకత్తు), సెక్షన్ 170 (నేరాలను నిరోధించడానికి అరెస్టు) కింద కేసులు నమోదయ్యాయి. ప్రశాంతతకు లేదా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉన్న వారిని విచారించి, శాంతిని కాపాడేందుకు (గరిష్టంగా 1 సంవత్సరం వరకు) బాండ్ సమర్పించాలని ఆదేశించే అధికారాన్ని బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 126 ఇస్తుంది. 

అదే విధంగా బిఎన్‌ఎస్ సెక్షన్ 170 ప్రకారం, ఒక cognizable offence పాల్పడేందుకు కుట్ర పన్నుతున్న వ్యక్తిని, ఆ నేరాన్ని నిరోధించలేని పక్షంలో వారెంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇతర చట్టాల కింద నిర్బంధానికి అనుమతి ఉంటే తప్ప, 24 గంటల వరకు కస్టడీకి టైమ్ ఉంటుంది.