Chapati Movement: భారత స్వాతంత్రోద్యమంలో బ్రిటీషర్లను వణికించిన చపాతీ ఉద్యమం గురించి తెలుసా..
Indias independence: చపాతీ ఉద్యమం 1857 ప్రారంభంలో ప్రారంభమైంది. సిపాయిల తిరుగుబాటు, తొలి స్వాతంత్య్ర సంగ్రామం సమయంలో చపాతీ ఉద్యమం బ్రిటీష్ సామ్రాజ్యాన్ని వణికించింది.

Chapati Movement | 1857లో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా తొలి స్వాతంత్య్ర సంగ్రామం జరిగింది. సిపాయిల తిరుగుబాటు ప్రారంభానికి కొన్ని నెలల ముందే, ఉత్తర భారతదేశం అంతటా ప్రజలు తెలివిగా వ్యూహాలు రచించారు. ప్రజలు ఒక బస్తీ నుండి మరొక బస్తీకి, మరో గ్రామానికి రొట్టెలను పంపడం ప్రారంభించారు. అందులో ఎలాంటి రాతపూర్వక సందేశం లాంటివి లేదు. ఎలాంటి నినాదాలు లేవు. కంటికి కనిపించే సూచనలు ఏవీ లేవు. అయినప్పటికీ, చపాతీలు (Rotis) బ్రిటిష్ అధికారులను వణికించాయి. అసలేం జరుగుతుందో అర్థంకాక తలలు పట్టుకున్నారు. ఆ సమయంలో ఈ సంఘటనను 'చపాతీ మూవ్‌మెంట్' (Chapati Movement) అని పిలిచేవారు.
చపాతీ ఉద్యమం ఎలా ప్రారంభమైంది?
ఫిబ్రవరి 1857లో చపాతీ ఉద్యమ ప్రారంభమైంది. మథుర వంటి ప్రాంతాల్లోని గ్రామ చౌకీదార్లకు గుర్తుతెలియని వ్యక్తుల నుండి కొన్ని రొట్టెలు అందాయి. మరిన్ని రొట్టెలు తయారు చేసి వాటిని పొరుగు గ్రామాలకు అందించాలని వారికి ఆదేశాలు వచ్చాయి. ఈ పద్ధతి చాలా తేలిక. చాలా ప్రభావవంతమైనది. అడవి ప్రాంతాల ద్వారా ప్రయాణించే ఒక ప్రయాణీకుడు గ్రామ చౌకీదార్‌కు చపాతీలు ఇచ్చి, వాటిని మళ్లీ తయారు చేసి ముందుకు పంపిణీ చేయాలని చెప్పేవాడు. రొట్టెతో పాటు ఎలాంటి సందేశం ఉండేది కాదు. కొద్ది రోజుల్లోనే ఈ ఉద్యమం మథుర, ఫరూఖాబాద్, గుర్గావ్, అవధ్, రోహిల్‌ఖండ్, ఢిల్లీలకు వేగంగా వ్యాపించింది..
బ్రిటిష్ పోస్టల్ సర్వీస్ కంటే వేగంగా
బ్రిటిష్ అధికారులను బాగా ఇబ్బంది పెట్టిన విషయం ఏంటంటే, నివేదికల ప్రకారం, ఈ చపాతీలు ఒకే రాత్రిలో దాదాపు 300 కిలోమీటర్ల దూరం చేరుకునేవి. ఇది ఆనాటి బ్రిటిష్ పోస్టల్ సిస్టమ్ కంటే చాలా ఫాస్ట్. ఈ నెట్‌వర్క్ వ్యవస్థీకృతంగా ఉన్నప్పటికీ మెస్సేజ్ కంటికి కనిపించకుండా సాగేది. రొట్టెపై ఎటువంటి కోడ్ భాష ఉండదు. రాజకీయ కరపత్రాలు లేవు. బహిరంగ ప్రకటనలు కూడా లేవు. పూర్తి స్థాయిలో విచారణ జరిపినప్పటికీ, బ్రిటిష్ వారు చపాతీలు ఎందుకు పంపుతున్నారు, దీని అసలు ఉద్దేశ్యాన్ని ముందుగా కనిపెట్టలేకపోయారు.
చివరికి బ్రిటిష్ అధికారులు ఇది చపాతీ ఉద్యమం అని, తిరుగుబాటుకు పునాది వేసే ఒక రహస్య కమ్యూనికేషన్ వ్యవస్థగా డీకోడ్ చేశారు. మథుర అప్పటి మెజిస్ట్రేట్ మార్క్ థోర్న్‌హిల్ దీనిని అశాంతిని కలిగించే సీక్రెట్ ఎక్స్‌పరిమెంట్ గా అభివర్ణించారు. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. వేలాది గ్రామాలు సైలెంట్‌గా ఒక ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని తెలిసి, బ్రిటీష్ ఉన్నత అధికారుల్లో భయం నెలకొంది.
ఇది తిరుగుబాటుకు కోడ్ భాషా?
చపాతీలు ఐక్యతకు, అందరి సంసిద్ధతకు చిహ్నమని అప్పట్లో ప్రజలు నమ్మారు. రొట్టెలను ఒకరికొకరు పంపుకోవడం అనేది తిరుగుబాటుకు సన్నద్ధం అవుతున్నారనే చిన్న సూచనగా భావించారు. తాంతియా తోపే, రాణీ లక్ష్మీబాయి వంటి నాయకుల సైన్యాలకు ఆహార సరఫరా కోసం ఇది వ్యూహం కావొచ్చని బ్రిటీషర్లు భావించారు.
1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో చపాతీలతో పాటు తామర పువ్వు (Lotus Flower) కూడా ఒక రహస్య సంకేతంగా పనిచేసిందని చరిత్రకారులు చెబుతారు.
తామర పువ్వు సీక్రెట్
చపాతీలు గ్రామీణ ప్రజల మధ్య ఐక్యతను చాటితే, తామర పువ్వులు ప్రధానంగా సైనిక దళాల (సిపాయిల) మధ్య రహస్య సందేశాలను పంపడానికి ఉపయోగించేవారు. ఒక బెటాలియన్‌లోని సైనికుడు తామర పువ్వును తీసుకువచ్చి తన తోటి సైనికుడికి ఇచ్చేవాడు. ఆ పువ్వును అందుకున్న ప్రతి సైనికుడు దానిని మరొకరికి అందించేవాడు.
ఆ పువ్వును చేత్తో పట్టుకోవడం అంటే.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటులో నేను సైతం అని ప్రమాణం చేయడమని అర్థం. చివరి సైనికుడికి తామర పువ్వు చేరిన తర్వాత, ఆ బెటాలియన్ తిరుగుబాటుకు సిద్ధమైందని సంకేతం. కొన్ని చోట్ల ఎర్రటి తామర పువ్వులను వాడటం వల్ల అది యుద్ధానికి లేదా రక్తం చిందించడానికి సిద్ధంగా ఉండాలనే హెచ్చరికగా భావించేవారు.
ఎందుకు ఇలా చేసేవారు..
బ్రిటిష్ అధికారులు భారతీయుల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలపై నిఘా పెట్టేవారు. అందుకే వారికి అనుమానం రాకుండా రొట్టెలు, చపాతీలు, పువ్వులు భారతీయ సంస్కృతిలో భాగం కాబట్టి, వీటిని ఒకరికొకరు ఇచ్చుకోవడం చూసి బ్రిటిష్ అధికారులు మొదట్లో అనుమానించలేదు.
సైనికుల్లో వేర్వేరు భాషలు మాట్లాడేవారు ఉన్నప్పటికీ, తామర, రోటీల ద్వారా చేరిన సందేశం అందరికీ అర్థమయ్యేది. ఇవి అడవి మార్గాల ద్వారా, గ్రామాల్లోని రహస్య దారుల ద్వారా బ్రిటిష్ వారి గుర్రపు స్వారీ పోస్టల్ సర్వీస్ కంటే వేగంగా ప్రయాణించేవి. సాదువులు, ఫకీర్లు గ్రామాల మధ్య తిరుగుతూ భజనలు లేదా ప్రసంగాల రూపంలో తిరుగుబాటు వార్తలను చేరవేసేవారు.
























