Pragyan Rover Confirms Oxygen :
చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమ ఖాతాలో మరో అద్భుతమైన విజయాన్ని సాధించుకున్నాయి. చంద్రుడిపై సౌత్ పోల్ పై తిరుగుతూ పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్... చంద్రుడి పొరల్లో ఉన్న కెమికల్ ఎలిమెంట్స్, ఖనిజాలను కనుగొంది.
ప్రజ్ఞాన్ రోవర్ లోని లిబ్స్ గా పిలుచుకునే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్ స్ట్రుమెంట్ సహాయంతో చంద్రుడిపై ఉన్న ఎలిమెంట్స్ ను కన్ఫర్మ్ చేసింది ఇస్రో. అన్నింటికంటే ముఖ్యంగా చంద్రుడి ఉపరితలంపై దక్షిణధృవంపై సల్ఫర్ నిల్వలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. అంత కంటే అద్భుతమైన విషయం ఏంటంటే చంద్రుడిపై ఆక్సిజన్ నిల్వలను కూడా గుర్తించింది ప్రజ్ఞాన్ రోవర్. అల్యూమినియం, కాల్షియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, సిలికాన్, టైటానియం నిల్వలను ధృవీకరించింది.
Photos Credit: Twitter/ISRO
హైడ్రోజన్ ను వెతికే పనిలో ఉన్నామని ప్రకటించిన ఇస్రో... అందుకు సంబంధించిన రెస్పాన్స్ వేల్ లెంత్ గ్రాఫ్ ను విడుదల చేసింది. చంద్రుడి సౌత్ పోల్ పై ఉన్న కెమికల్ ఎలిమెంట్స్ ఏంటి అనే విషయాలపై ఇప్పటివరకూ ఫార్ అవే అబ్జర్వేషన్స్ తప్ప ఇన్ సైటూ సైంటిఫిక్ ఎక్స్ పెరిమెంట్స్ ఏ దేశం చేయకపోగా ఆ ఘనత సాధించిన తొలి స్పేస్ ఏజెన్సీగా ఇస్రో..తొలి దేశంగా భారత్ పేరు సంపాదించనట్లైంది. సల్ఫర్ ను సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారీ దగ్గర నుంచి రాకెట్ ప్రొపల్లెంట్స్ తయారీ వరకూ ఉపయోగించుకునేందుకు అవకాశం ఉండగా..ఆక్సిజన్ ప్రాణవాయువుగా మనిషి మనుగడకు సహకరించనుంది.
ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై చకచకా కదులుతూ ఇస్రో శాస్త్రవేత్తల శ్రమను ముందుకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలో రోవర్ ఓసారి మూడు అడుగుల గుంతలో పడబోయింది. రోవర్ మార్గాన్ని గమనించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఇచ్చిన ఆదేశాలతో ప్రజ్ఞాన్ తన దిశను మార్చుకుని ప్రయాణం కొనసాగించింది. ఈ క్రమంలో చంద్రుడిపై మానవాళి మనుగడుకు అవసరమైన ఆక్సిజన్ వాయువుతో పాటు మరిన్ని వాయువులు, ఖనిజ లవణాలను రోవర్ గుర్తించింది. ఏ దేశం కాలుమోపని జాబిల్లి దక్షిణ ధృవంపై చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దిగడంతో రోవర్ తో పరిశోధనలు కొనసాగిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఐరన్, సిలికాన్, పాస్పరస్ లాంటి నిక్షేపాలు ఉన్నాయని వివరాలు అందించడంపై ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. ఇస్రో శాస్రవేత్తలు సాధిస్తున్న ఘనతలపై అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.